Banjara Hills | బంజారాహిల్స్,మే 16: నగరం నడిబొడ్డున రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలపై ‘కబ్జా కోసం..విశ్వ ప్రయత్నాలు..’ పేరుతో ప్రచురితమైన నమస్తే తెలంగాణ కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నెంబర్ 111, బ్లాక్- హెచ్, వార్డు-10లో 5 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు బోగస్పత్రాలతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.
5ఎకరాల స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఉండగా లోపలివైపు సీసీ కెమెరాలు, వేటకుక్కలతో ప్రైవేటు వ్యక్తులు నిఘా పెట్టిన వ్యవహారంపై శుక్రవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితిలో ప్రైవేటు వ్యక్తులు లోనికి వెళ్లకుండా చూడాలని, స్థలంపై నిరంతరం నిఘా పెట్టాలని షేక్‌పేట్ మండల తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన తహసీల్దార్ అనితారెడ్డి ఆదేశాలతో షేక్‌పేట మండల రెవెన్యూ ఆర్ఐలు అనిరుధ్, భానుతో పాటు ఇతర సిబ్బంది ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటినీ తొలగించారు.
స్థలంలోపల ప్రహరీ గోడలు, ఫెన్సింగ్‌తో పాటు చెట్లపై కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కరెంట్ సరఫరా లేకున్నా సీసీ కెమెరాలు పనిచేసేలా కొన్ని సీసీ కెమెరాలకు సోలార్ ప్యానెల్స్ సైతం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించిన రెవెన్యూ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.
స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆన్లైన్ ద్వారా అనుసంధానించుకుని నిరంతరం చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారా అనే విషయంపై నిఘా వేస్తున్నారని, బయటివారు స్థలంవద్దకు రాగానే సీసీ కెమెరాల్లో గుర్తించి ప్రైవేటు వ్యక్తులతో బెదిరింపులకు దిగుతున్నారని తేలింది. ప్రభుత్వ స్థలంలోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించిన రెవెన్యూ అధికారులు, స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా గేటుకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఎవరైనా లోనికివస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు.