సిటీబ్యూరో/ఉప్పల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములు ఖాళీ చేయాలంటూ రాత్రి వేళల్లో రెవెన్యూ అధికారులు బాధితులపై మారణాయుధాలతో బెదిరిస్తున్నారు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్లను ఖాళీ చేయించాలంటే పగటి వేళల్లో పోలీసు బందోబస్తుతో వెళ్లాల్సిన అధికారులు.. చీకటివేళల్లో వెళ్లాల్సిన అవసరమేంటీ.. అంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు.
కత్తులు, లాఠీలతో బెదిరిస్తూ తమ గుడిసెలను ధ్వంసం చేసేందుకు ఉప్పల్ రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఓ బాధితుడు ముఖ్యమంత్రి, కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు లేఖలు పంపించాడు. ప్రజాపాలనలో చీకటి వేళల్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో అధికారులు బాధితులను బలవంతంగా ఖాళీ చేయించడం ఏంటీ.. ? మహిళా అధికారులు పోలీసు ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం ఏంటీ? మహిళా అధికారులే కత్తులు చూపించడం ఏంటీ? అనే విషయం ఇప్పుడు సామాన్య ప్రజలకు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారంటే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు నోటీసులు ఇవ్వడం, పోలీసుల ప్రొటెక్షన్‌తో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో సమయంలో ఖాళీ చేయిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని, ప్రజాగ్రహాన్ని తట్టుకోలేమని ప్రభుత్వ అధికారులను చీకట్లో పనిచేయిస్తున్నారా? అంటూ ప్రభుత్వంపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. చీకట్లో పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా మహిళా అధికారులు విధులు నిర్వహించడంతో కబ్జారాయుళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉంటే దానికి ఎవరు బాధ్యులు వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఉప్పల్ రెవెన్యూ పరిధిలో..
ఉప్పల్ రెవెన్యూ పరిధిలోని ఫతుల్లాగూడలోని సర్వేనంబర్ 58లో అర్బన్ హాట్స్ స్లమ్ డెవెలర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్‌లో పలువురు పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. అందులో మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని అసోసియేషన్‌కు చెందిన నాయకులు, మరికొందరు స్థానిక నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ స్థలం ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాలంటూ స్థానిక ప్రజలు, మరో సొసైటీ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై ఉప్పల్ మండల కార్యాలయం అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యిందని, దానిని వెంటనే ఖాళీ చేయించాలని అందుకు తగిన బందోబస్తును 28న ఇవ్వాలంటూ ఉప్పల్ రెవెన్యూ అధికారులు గత నెల 26న నాగోల్ పోలీసులకు లేఖ రాశారు. అయితే పోలీసులు తాము ప్రొటెక్షన్ ఇవ్వలేమని రెవెన్యూ అధికారులకు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులే స్వయంగా వేళపాలా లేకుండా 28వ తేదీ తెల్లవారుజామున రంగంలోకి దిగారు.
బెదిరింపులపై ఫిర్యాదు
పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పి తగిన బందోబస్తు చర్యలతో రెవెన్యూ అధికారులు ముందుకు వెళ్లాలి. కాని గత నెల 28వ తేదీన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉప్పల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశ్విని, సిబ్బంది నాగమణి, మరో రిటైర్డు ఉద్యోగి తదితరులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ కబ్జాచేసిన వాళ్లను హెచ్చరిస్తూ వెంటనే ఖాళీ చేయాలంటూ తమ చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ ఓ అధికారి బెదిరించారు.
ఈ వీడియో బయటకు వచ్చింది. మహిళా అధికారి కత్తి పట్టుకొని మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. మరణాయుధాలతో బెదిరించడం ఎంత వరకు సమంజసం, అధికారులు ఆ సమయంలో ఎందుకు వచ్చారు, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఎలా వెళ్లారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఫిర్యాదు తీసుకోలేదని, ఈ విషయాన్ని కలెక్టర్, ముఖ్యమంత్రి, రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానంటూ బాధితుడు తెలిపారు.
కబ్జా స్థలం కాపాడేందుకే..
ఈ విషయంపై ఉప్పల్ రెవెన్యూ అధికారులను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించింది. తాము పోలీస్ ప్రొటెక్షన్ కోరామని, పోలీసులు బందోబస్తు ఇవ్వలేదని తెలిపారు. దీంతో తాము ఉదయం 4.30 గంటల ప్రాంతంలో కబ్జా స్థలాన్ని కాపాడేందుకు వెళ్లామని చెబుతున్నారు. అక్కడ టెంట్ వేయడంతో తాడు కట్‌చేసేందుకు అక్కడున్న కత్తిని తీసుకున్నామని తాము ఎవరిని బెదిరించలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో విధి నిర్వాహణలో భాగంగా అక్కడకు వెళ్లామంటూ అధికారులు పేర్కొన్నారు.