Dundigal | దుండిగల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, గండిమైసమ్మ-దుండిగల్ మండల పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు స్థలాలు కబ్జాకు గురవుతున్నా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం ప్రజలు ఫిర్యాదు చేసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మండల పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు మాయమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లేదారిలోని వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు మట్టిని నింపి.. చదును చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గండిమైపమ్మ-దుండిగల్ మండలం, దొమ్మరపోచంపల్లి గ్రామం, సర్వే నంబర్ 120/24 ప్రభుత్వ భూమిలో కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని వేస్తూ.. జేసీబీతో చదును చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
సదరు స్థలం గండిమైసమ్మ చౌరస్తా నుంచి మేడ్చల్ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉండటంతో పాటు ఎదురుగా దుండిగల్ పోలీస్స్టేషన్, కూతవేటు దూరంలో తహసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాలు ఉండటంతో ఇక్కడి భూమికి గజం లక్షల్లో ధర పలుకుతున్నది. దీంతో విలువైన ప్రభుత్వ భూమిని ఎలాగైనా..ఆక్రమించుకునేందుకు కొందరు రాత్రికి రాత్రి మట్టిని నింపి చదును చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం అధికారులకు తెలిసినా.. ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని, సదరు ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, ఈ విషయమై మండల రెవెన్యూ అధాకారులను సంప్రదించగా, ఎవరూ స్పందించకపోడం గమనార్హం.