జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన ప్రభుత్వం ..పూర్తిగా కార్పొరేషన్లను ప్రైవేటీకరణ బాట పట్టిస్తున్నది..ఇప్పటికే మోడల్ మార్కెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ప్రైవేట్ పరం చేసిన సర్కారు..తాజాగా ప్రాజెక్టులను సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీటీ) పద్ధతిలో చేపట్టేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ) కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రాజెక్టులు, నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌పై భరోసా ఇవ్వలేదు..రెండేళ్లుగా సరైన నిధుల కేటాయింపులో జాప్యం చేయడం..ఫలితంగా ఖజానా అప్పుల కుప్పగా మారింది. ఈ నేపథ్యంలోనే పీపీపీ ప్రాజెక్టులను తెరపైకి తీసుకువచ్చింది.
– సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)
నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటనలతో కూడిన స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ట్రై కమిషనర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ భూముల్లోను మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. నెక్లెస్‌రోడ్ పక్కన పలు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు ఆర్వీ కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డిలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని..ఎక్కడైనా చెత్త కనబడితే సహించమని అధికారులను సీఎం హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు తెల్లవారు జామున ఆరు గంటలకే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకటనలకు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ రకాల బోర్డులు కనిపిస్తున్నా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై అధికారులను సీఎం ప్రశ్నించారు.
ముంబాయి, అహ్మదాబాద్, బెంగుళూరులోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా పీపీపీ, ఇతర నమూనాల్లో ఆదాయం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలోని పార్కుల వివరాలు సేకరించాలని..వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.