Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పిల్లలు ఆడుకునేటప్పుడు రాళ్లను గుట్టగా పేరుస్తారు… అన్నీ పేర్చిన తర్వాత వాటిని చెదరగొడతారు! మళ్లీ తిరిగి పేరుస్తారు!! వాళ్లకు అదో సరదా. గతేడాది కాలంగా హైదరాబాద్ మహా నగరాభివృద్ధిపై రేవంత్ సర్కారు తీరు ఇట్లనే కనిపిస్తున్నది. ఏ విభాగాన్ని పట్టుకున్నా… తొలుత దానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించి, అమలైన ప్రతిపాదనలను చెదరగొడుతున్నారు… కొన్ని రద్దు చేస్తున్నారు… తిరిగి పాత పనులతోనే కొత్త ప్రతిపాదనలు రూపొందించి నూతనంగా నామకరణం చేస్తున్నారు. తాజాగా రమారమి రూ.80-90 వేల కోట్ల ప్రతిపాదనలతో సీఎం సహా పలు విభాగాల అధికారుల హడావిడి మళ్లీ మొదలుపెట్టారు. ఇందులో కేంద్రం వాటాగా వేల కోట్లను ప్రతిపాదించినా ఇటీవల కేంద్ర బడ్జెట్లో చిల్లిగవ్వ కేటాయింపు లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి ఖజానాలు కూడా ఖాళీగా ఉండటంతో నిధుల సమీకరణ అనేది మిలయన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కొత్త సీసాలో పాత సారానే…
దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలోని రవాణా వ్యవస్థలో వేళ్ల మీద లెక్కించేంత మౌలిక సదుపాయాలు వచ్చాయి. కానీ గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాలు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలను పొందాయి. వ్యూహాత్మర రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) మొదటి దశ కింద సుమారు రూ.6800 కోట్లతో చేపట్టిన పనుల్లో దాదాపు 35కు పైగా ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, తీగల వంతెన… ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇంకోవైపు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వందల కిలోమీటర్ల లింకు, కొత్త రోడ్ల నిర్మాణంతో నగరం నలుమూలలా ముఖచిత్రమే మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్డీపీ రెండో దశ కింద కూడా కేసీఆర్ ప్రభుత్వం వేలాది కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. కానీ అధికారంలో వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఒత్తిడిని అధిగమించేందుకు రూ.20వేల కోట్ల నిధుల సమీకరణ చేయాలనే దానిపై కన్సెల్టెంట్లతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది.
సుంకిశాలను ముంచి…
రూ.1006 కోట్లతో కొందపోచమ్మ సాగర్ నుంచి నగరానికి పది టీఎంసీల గోదావరిజలాలు వచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం డిజైన్ రూపొందిస్తే… రేవంత్ సర్కారు దాని డిజైన్ మార్చి అదనంగా 26 కిలోమీటర్ల పైప్‌లైన్ పెంచి మల్లన్నసాగర్ నుంచి నీటి సేకరణకు నిర్ణయించింది. తద్వారా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7300 కోట్లకు ఎగబాకింది.
ఎలివేటెడ్ ప్రాజెక్టు…
ప్యారడైజ్-డెయిరీ ఫాం రోడ్డు (5.8 కిలోమీటర్లు), జేబీఎస్ – తూంకుంట (18 కిలోమీటర్లు) ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేంద్రంలోని మోదీ సర్కారు రక్షణ భూములకు క్లియరెన్స్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసింది. గతేడాది జనవరి 24న రక్షణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హడావిడిగా ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేకపోయారు.
కేబీఆర్ పార్కు దాటేదెలా?
కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కుముళ్లు లేకుండా ప్రయాణించేందుకు కేసీఆర్ ప్రభుత్వమే గతంలో ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ పర్యావరణ అనుమతుల చిక్కుతో పాటు స్థానికులు కూడా వ్యతిరేకించడంతో ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొన్నిరోజుల కిందటటేడు చొప్పున అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లను నిర్మించేందుకు నిర్ణయించింది. జీహెచ్ఎంసీ భూసేకరణ పూర్తి చేస్తే రూ.1090 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టాలని అనుకున్నారు. అయితే భూసేకరణకు సర్వే మొదలైంది. భూసేకరణ పూర్తి చేయడం ఒక చిక్కయితే… గతంలో నష్టపరిహారం కింద జీహెచ్ఎంసీ టీడీఆర్‌లు (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) ఇచ్చేది. కానీ ఏడాది కాలంగా రియల్, నిర్మాణ రంగాలు దెబ్బతినడంతో టీడీఆర్‌లకు డిమాండు తగ్గింది. ఎలివేటెడ్ కారిడార్లోనే బాధితులు టీడీఆర్‌లకు విముఖత చూపడంతో హెచ్ఎండీఏ నగదు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఈ ప్రాజెక్టులో జీహెచ్ఎంసీ నగదు ఇవ్వాలంటే అది సాధ్యమేనా? జీతభత్యాలు, నిర్వహణకే సతమతం అవుతున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.వెయ్యి కోట్ల బకాయిలనే ఇవ్వలేకపోతున్నది.
మీరాలం వంతెన చేపట్టేదెవరు?
మీరాలం చెరువు అభివృద్ధితో పాటు దుర్గం చెరువులా తీగల వంతెన ప్రాజెక్టు ప్రతిపాదనలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయి. దీనిపై ఇటీవల రేవంత్‌రెడ్డి ప్రభు త్వం హడావిడి మొదలుపెట్టింది. అయితే దీనిని ఏ విభాగం చేపడుతుందనే దానిపై అధికారుల్లోనే అయోమయం నెలకొంది.
బాండ్లపైనే హెచ్ఎండీఏ ఆశలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.150 కోట్ల ఆదాయంతో వేలాది కోట్ల అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యమైన హెచ్ఎండీఏ ఇప్పుడు నిధులులేక విలవిలలాడుతున్నది. రియల్, నిర్మాణ రంగం పడిపోయి ఆ దాయం నెలకు రూ.60-70 కోట్లకు మించకపోవడంతో అది నిర్వహణకే సరిపోతున్నది.
మెట్రో పయనమెటు..?
హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత పదేండ్లలో రోడ్డు నెట్‌వర్క్‌ను గణనీయంగా మెరుగుపరిచిన తర్వాత మెట్రోపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా 2023 ఆగస్టులో జరిగిన మంత్రవర్గ సమావేశంలో నూ.60వేల కోట్లతో 309 కిలోమీటర్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రానున్న 2-3 సంవత్సరాల్లో వీటిని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకుంది. అప్పటికే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోను ప్రారంభించింది. జీఎమ్మార్, హెచ్ఎండీఏ, ఎల్అండ్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.6250 కోట్లతో 31 కిలోమీటర్ల చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో సర్వే కూడా మొదలైంది.
కానీ 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే రాయదుర్గం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసింది. దీంతో దానిపై అప్పటివరకు వెచ్చించిన కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు ఉండొద్దనే ఆలోచనతో రేవంత్ సర్కారు మళ్లీ మెట్రో ప్రతిపాదనలపై మల్లగుల్లాలు మొదలుపెట్టింది.
ఎట్టకేలకు రెండో దశలో నాలుగు మార్గాల్లో 68.9 కిలోమీటర్ల మెట్రోకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించి, కేంద్రానికి పంపింది. ఇప్పటివరకు కేంద్రంలో డీపీఆర్ పరిశీలననే పూర్తి కాలేదు. పైగా మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ఈ ఊసే ఎత్తకపోవడంతో కేంద్రం నుంచి వస్తుందనుకున్న రూ.4,368 కోట్లపై ఆశలు ఆవిరయ్యాయి. పైగా కేంద్రం సాంకేతిక అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రూ.11689 కోట్లు (48 శాతం ) రుణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రోను గత ఒప్పందం మేరకు చేపట్టేందుకు ఎల్అండ్టీ నిరాకరించడంతో రూ.2741 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఇప్పుడది భూసేకరణ దశలోనే ఉంది. కేంద్రం మొండిచేయి చూపడం, పీపీపీకి ఎల్అండ్టీ నిరాకరించడంతో రాష్ట్రమే మొత్తం భరించాల్సి ఉంది.
శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీ మెట్రో అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో 40.318 కిలోమీటర్ల ప్రతిపాదనలు, మేడ్చల్ మెట్రో కింద ఇంకో 45 కిలోమీటర్ల (జేబీఎస్-శామీర్‌పేట, జేబీఎస్-మేడ్చల్) ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. రెండో దశ అంచనాల ప్రకారం లెక్కిస్తే కిలోమీటరకు రూ.318 కోట్లు అవుతున్నందున… మూడో దశలోని 85.318 కిలోమీటర్లకు రూ.25,541 కోట్ల వరకు అవుతుంది. అంటే కేవలం మెట్రో ప్రాజెక్టులపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.50వేల కోట్ల వరకు ప్రతిపాదనలను ముందు పెట్టుకుంది. ఏడాది గడిచినప్పటికీ ఇప్పటివరకైతే పాతబస్తీ మెట్రో భూసేకరణ మినహా ఎక్కడా కించిత్తు కదలిక లేదు.