
సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : మళ్లీ కొవిడ్ భయం మొదలైంది. దేశ, విదేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్ద నుంచి పని చేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోం) ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి పని చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు ఇంటి వద్ద నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయాల్సి రావడం, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో ఆఫీసుకు వెళ్లాలనే ఆసక్తి చూపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఐటీ కంపెనీలు కూడా ఆఫీసుకు వచ్చి పని చేసే విధానం (రిటర్న్ టు ఆఫీసు)పై పునరాలోచిస్తున్నాయి. అనేక దేశాలు ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంటుందని గుర్తించామని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచింది. ఈ నేపథ్యంలో అటు ఐటీ కంపెనీలు, ఇటు ఉద్యోగులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. వ్యాక్సినేషన్ తీసుకున్నా ఆఫీసుకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదని, ఐటీ కంపెనీలన్నీ సెంట్రల్ ఏసీతో ఉండడం వల్ల, ఒకే ఫ్లోర్లో 150 నుంచి 200 మంది పనిచేసే అవకాశం ఉండడంతో వైరస్ వ్యాప్తి అందరిపైనా ఒక్కసారిగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి చోట ఐటీ ఉద్యోగులు పనిచేసే పరిస్థితి ప్రస్తుతం లేదని, ఐటీ కంపెనీల్లో పని చేసే చోటు (వర్క్ ప్లేస్)ను పూర్తి రీడిజైన్ చేసి, ఏసీ కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తే ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేస్తారని ఫోరమ్ ఫర్ ఐటీ అధ్యక్షులు కిరణ్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఐటీ ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పనిచేసేందుకు ఆసక్తి చూపుతారని, అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానమే అమలు చేయాలని తాము ఐటీ కంపెనీలను కోరినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, 10 రాష్ర్టాల్లో పాజిటివ్ రేట్లు పెరుగుతున్నాయని, దీన్ని పరిగణలోకి తీసుకొని ఆయా ప్రభుత్వాలు అవసరమైతే నైట్ కర్ఫ్యూను విధించాలని ఆయా రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది.