HCU | చిక్కడపల్లి, ఏప్రిల్ 5: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని టీజీఐసీకి కేటాయించడం అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అట్టి భూములను తిరిగి వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ (డీఎస్ ఏ), డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డీఏటీఏ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, పాశం యాదగిరి, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, ప్రొఫెసర్ వెంకట దాసు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు హాజరై మాట్లాడారు.యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అణిచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని అన్నారు.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థుల త్యాగ ఫలితంగా ఏర్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 2324 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని.. పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి రాష్ట్రపతి ఉత్తరువులో భాగంగా ఏర్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన 2324 ఎకరాల భూమిని కేవలం విద్యారంగ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని, ఇతరత్రా ఉపయోగించడానికి వీలులేదని పేర్కొన్నారు.
హెచ్సీయూ గతంలో హైదరాబాద్ పట్టణానికి దూరంగా ఉన్నదని.. కానీ కాలం గడిచిన కొద్దీ అది పట్టణ కేంద్రానికి మధ్యలోకి వచ్చిందని.. అందుకే హెచ్సీయూ భూములపై ప్రైవేటు పెట్టుబడిదారుల కన్ను పడిందన్నారు. నాటి ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంపై కొనసాగించిన వివక్ష, అణిచివేత చర్యల ఫలితంగా హెచ్సీయూ భూములు రకరకాల కంపెనీలు, సంస్థలకు అప్పనంగా అప్పగించబడ్డాయి అని పేర్కొన్నారు. కంచె చేను మేసినట్లుగా యూనివర్సిటీ భూములను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీజీఐ ఐ సి కి అప్పగించి ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని బుకాయిస్తున్నదని మండిపడ్డారు.
విద్యారంగ అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల అవసరం కోసం యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వమే నేడు అందుకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి పూనుకోవడం అన్యాయం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కపట నాటకాన్ని, మోసాన్ని బట్టబయలు చేసిన యూనివర్సిటీ విద్యార్థులపై అణిచివేత చర్యలకు పూనుకోవడాన్ని తెలంగాణ సమాజం సహించదని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టి 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వెంటనే తిరిగి యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ అబ్దుల్ అకీమ్, వివిధ సంఘాల నాయకులు కన్నే కంటి రవి, బాల్రాజ్, గణేష్,ఉపేందర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.