KCR | వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 22 : ఆరేడు దశాబ్దాలుగా బీడు భూములుగా సాగు నీటికి నోచుకోక నోళ్లు తెరుచుకొని ఓరకు పడ్డ భూములన్నీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ రాకతో, ఆ అపర భగీరథుని వ్యూహంతోనే పచ్చని పైర్లుగా వర్ధిల్లాయని పలువురు శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను పురస్కరించుకుని రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంది. దేశంలోని ప్రధాన శాస్త్రవేత్తలను, ఉత్తమ రైతులను, పూర్వపు, ప్రస్తుత విద్యార్థులను పిలిచి ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులందుకున్న అధికులు గత పదేళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ సాగులో విప్లవాత్మక మార్పు తీసుకు వచ్చారని, ఆ ఫలితాలే నేడు మమ్ములను ఉత్తమ రైతుగా, శాస్త్రవేత్తగా నిలబెట్టాయని, ప్రస్తుతం ఇక్కడ విద్యనభ్యసించిన వారు, ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంకర్లు, పారిశ్రామిక వేత్తలు, ప్రజా ప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన పలువురు ప్రత్యక్ష, పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
రైతుకు అనేక సంక్షేమాలు అమలు చేయడం వల్లే ఎడారిని తలపించే బీ(ఊ)ళ్లన్నీ పచ్చ తోరణాలుగా, ఆత్మహత్యలు లేని తెలంగాణగా దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ఈ సందర్భంగా చివరి సెషన్లో పూర్వపు విద్యార్థి, విశ్రాంత ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వర్సిటీ వజ్రోత్సవ సందర్భంగా వీసీ అల్దాస్ జానయ్య తీసుకున్న చొరవ వల్లే ఇంత మందిమి కలుసుకునే భాగ్యం కలిగిందన్నారు. భారత్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నూతన వంగడాలు, సేంద్రీయ సేద్యం, నూతన టెక్నాలజీకి అనుగుణంగా సాగువైపు రైతులను మళ్లించాలన్నారు. మనమంతా ఎవ్వరి వృత్తిని వారు గౌరవిస్తూ మంచి ఫలితాలు పొందితే మనం అభివృద్ధి బాటలో నడవటం ఖాయమన్నారు. విద్యావేత్తలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రపంచ దేశాలలో మనకు ఉన్న వనరులు ఎక్కడా లేవని సూచించారు. సాగు పట్ల మానవ వనరులతో పాటు యాంత్రిక వనరులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
దేశంలోనే వివిధ పంటల సాగుకు మన నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలమన్నారు. ఎక్కువగా చిన్న సన్న కారు రైతులకు అండగా ఉండాలని సూచించారు. ఇతర దేశ వ్యవసాయానికి మనకు చాలా తేడా ఉందని సూచించారు. మన వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా పరిశోధలు జరగాలని సూచించారు. యాంత్రీకరణ, మార్కెటింగ్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎరువులు, పురుగు మందులు రైతులు అధికంగా వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందిండంలో పీజేటీఏయూ వంటి సంస్థలదే కీకల పాత్ర అన్నారు. నేల ఆరోగ్యం, పర్యావరణం, మానవ ఆరోగ్యం వంటి అనేక కోణాలని చూడాలన్నారు. యువతను వ్యవసాయం వైపు పెద్ద ఎత్తున ఆకర్షించగలుగుతామని తద్వారా ఆహార భద్రతను సాధించ గలమన్నారు. డిజిటల్ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. పలువురు అభ్యుదయ రైతులకు వీసీ అల్దాస్ జానయ్య ఆధ్వర్యంలో సన్మానం చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు.