Hyderabad | బంజారాహిల్స్, డిసెంబర్ 31: షేక్‌పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం.14లో సుమారు రూ.100కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు మరోసారి కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’లో ‘ఖరీదైన స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో మంగళవారం కథనం ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ కబ్జాదారులు చెరిపివేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తిరిగి రాయించడంతో పాటు బ్లూషీట్ల పై కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. షేక్‌పేట మండలం సర్వే నం. 403/పిలో టీఎస్ నం. 17, బ్లాక్-డి, వార్డు- 10 పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం.14 ప్రధాన రహదారిపై ఉన్న స్థలం విషయంపై బాదం రంగస్వామి అనే వ్యక్తికి, ప్రభుత్వానికి మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగిన వివాదంలో స్థలం మొత్తం ప్రభుత్వానిదే అంటూ 2022లో సుప్రీంకోర్టులో తుదితీర్పు వచ్చింది.
అయితే ఈ స్థలం టీఎస్ 19 బ్లాక్‌లోని సర్వే నం.129/56 కిందకు వస్తుందంటూ సయ్యద్ షేక్ ఖాలిద్ అనే వ్యక్తి రంగంలోకి దిగి ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిన వైనం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ మంగళవారం వెలుగులోకి తీసుకురావడంతో షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలంలో ప్రైవేటు వ్యక్తులు రాసిన బోర్డులను చెరిపివేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఉన్నాయని, ప్రైవేటు వ్యక్తులు వాటిని చెరిపేసేందుకు ప్రయత్నించిన విషయం తమదృష్టికి రావడంతో వాటిని తిరిగి రాయించడంతో పాటు పాడైన బోర్డులను పునరుద్ధరించామని తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు.