సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ట్రై పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఇష్టానుసారంగా పునర్విభజన చేపట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు. వేగంగా సేవలందించేందుకు గతంలో వికేంద్రీకరణ చేశారు. 25 ఏండ్ల క్రితం ఉన్న పోలీసింగ్‌లా హైదరాబాద్‌ను విభజించారని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో మత కలహాలు నేరాలు జరుగుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు వేగంగా సేవలు అందించాలని పాతబస్తీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీస్స్టేషన్లను పునర్విభజన చేశారు.
అప్పట్లో సౌత్‌జోన్ పరిధిలో ఉండే ప్రాంతాలను ఈస్ట్జోన్లోకి, వెస్ట్జోన్లోకి ఇలా కలుపుతూ నాలుగు జోన్లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత సెంట్రల్ జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలతో సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధి ఎక్కువగా ఉండడంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆ కమిషనరేట్‌ను 2016లో రెండు కమిషనరేట్లుగా ఏర్పాటు చేసి అవుటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్న ప్రాంతాలను సైతం ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి కొంత భాగాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అప్పటికే ఉన్న ఐదు జోన్లను ఏడు జోన్లుగా చేర్చి కొత్త ఠాణాలను అందుబాటులోకి తెచ్చారు.
ఇలా పోలీసు సేవలను వికేంద్రీకరిస్తూ వేగంగా ప్రజలకు సేవలిందించేందుకు కమిషనరేట్లు, జోన్లను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే జీహెచ్ఎంసీని విడదీసినట్లుగా ట్రై పోలీస్ కమిషనరేట్లను విభజించారని ఆరోపణలు వస్తున్నాయి. రాచకొండ పేరు లేకుండా చేయడం వెనుక ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే ఒక కమిషనరేట్‌కు ఆ కమిషనరేట్‌లోని పోలీస్‌స్టేషన్ సిబ్బంది, అధికారులు వచ్చిపోయేలా ఉండాలి. కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజిగిరి కమిషనరేట్లోకి హైదరాబాద్ నార్త్‌జోన్‌లోని కొన్ని ప్రాంతాలు కలుస్తున్నాయి. అలాగే యాదాద్రి భువనగిరి, మహేశ్వరం జోన్లు తొలగించారు. మహేశ్వరం జోన్‌లోని రెండు మూడు పోలీస్స్టేషన్లను హైదరాబాద్‌లో కలిపేందుకు ప్రణాళికలు చేశారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ నుంచి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రావాలంటే సిబ్బంది 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అలాగే శంకర్పల్లి నుంచి ప్యూచర్ సిటీ కమిషనరేట్‌కు 66 కిలోమీటర్ల ఉంటుంది.
ప్యూచర్ సిటీ వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతమని అందుకే ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్ ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా.. ప్యూచర్ లేని సిటీకి కమిషనరేటా? అంటూ సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న మహేశ్వరం జోన్‌లోని ప్రాంతాలతో పాటు ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చెవేళ్ల నియోజకవర్గాల్లోని ప్రాంతాలతో ఈ కొత్త కమిషనరేట్ ఏర్పాటవుతుంది.
అంటే రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలు ఇప్పుడు మూడు కమిషనరేట్ల పరిధిలోకి రానున్నాయి. మల్కాజిగిరి, సైబరాబాద్, ప్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోకి రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలు వస్తాయి. ప్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కరించుకోవడానికి ఇక్కడ పోలీసింగ్‌ను అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రై కమిషనరేట్లను విడగొట్టడానికి జీహెచ్ఎంసీ పునర్విభజనే ఆధారమంటూ చెబుతూ ముక్కలు ముక్కలుగా విడగొట్టారంటూ పోలీస్ శాఖలోనే పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాల పునర్విభజనలో శాస్త్రీయత లేకుండా ప్రణాళికలు లేకుండా చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంపై పోలీసు అధికారులు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు.
బేగంపేట్(కొత్త జోన్ ప్రతిపాదన)తో మూడు డివిజన్లు, 9 పోలీస్స్టేషన్లు, ఎల్బీనగర్ జోన్లో డివిజన్లు ఏడు పోలీస్స్టేషన్లు, మల్కాజిగిరి జోన్లో మూడు డివిజన్లు (కీసర డివిజన్ ప్రతిపాదన) 8 పోలీస్స్టేషన్లు, కొత్తగా ఉప్పల్ జోన్ ప్రతిపాదనతో రెండు డివిజన్లు ఆరు పోలీస్స్టేషన్లు, మొత్తం 4 జోన్లు, 10 డివిజన్లు, 30 పోలీస్స్టేషన్లతో కమిషనరేట్‌లో ఉండనున్నాయి.
శేరిలింగంపల్లి (కొత్త) జోన్లో రెండు డివిజన్లు, ఏడు పోలీస్స్టేషన్లు, కూకట్పల్లి జోన్లో మూడు డివిజన్లు, ఏడు పోలీస్స్టేషన్లు, కత్బుల్లాపూర్(కొత్తది) రెండు డివిజన్లు 8 పోలీస్స్టేషన్లు ఉండనున్నాయి, మూడు జోన్లు, 7 డివిజన్లు, 22 పోలీస్స్టేషన్లు సైబరాబాద్‌లో ఉండనున్నాయి.
ప్యూచర్ సిటీలో మహేశ్వరం జోన్లో రెండు డివిజన్లు, ఏడు పోలీస్స్టేషన్లు, మొహినాబాద్(కొత్తది) జోన్లో మూడు డివిజన్లు 6 పోలీస్స్టేషన్లు, షాద్‌నగర్ జోన్(కొత్తది)లో రెండు డివిజన్లు 9 పోలీస్స్టేషన్లు ఉండనున్నాయి. మూడు జోన్లు, ఆరు డివిజన్లు 22 పోలీస్స్టేషన్లు ఉండనున్నాయి.
సిటీ బ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్‌లో సమూలంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్, ఫ్యూచర్‌సిటీ పేర్లతో కమిషనరేట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా వాటికి సంబంధించి ఎన్ని జోన్లు, పోలీస్స్టేషన్ల వివరాలపై చర్చ జరుగుతుంది. ఈ నాలుగు కమిషనరేట్లలో అత్యంత పెద్దదైన కమిషనరేట్‌గా హైదరాబాద్ ఆవిర్భవించనున్నది. గతంలో ఉన్న నార్త్‌జోన్‌లో కొన్ని పీఎస్‌లు మల్కాజిగిరి కమిషనరేట్‌లో కలుస్తుండగా మిగతా అన్ని పీఎస్‌లతో పాటు సరికొత్తగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్స్టేషన్లను హైదరాబాద్‌లోకి తీసుకొచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 7 జోన్ల్లు, 26 డివిజన్లు, 72 పోలీస్స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలకు జాబితా వైరల్ అవుతుంది. పోలీస్ కమిషనరేట్ల మార్పులో భాగంగా శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లను కొత్తగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కలిపారు. కొత్తగా బడంగ్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో శంషాబాద్‌కు సంబంధించి ఒక కొత్త ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ అవసరముంటుందని స్థానిక పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బాలాపూర్ వద్ద ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని వారు చెప్పారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నగరంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే క్రమంలో 1955 ఆగస్టులో శాంతిభద్రతల డీసీపీ ఆధ్వర్యంలో డీసీపీ, 4 డివిజన్లు, 34 పోలీస్స్టేషన్లుగా మార్చారు. 1981 ఆగస్టులో నాలుగుజోన్లు, 12 డివిజన్లకు చేరింది. 2023లో 28 డివిజన్లు, ఏడు జోన్లుగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలోను పోలీస్స్టేషన్ల సరిహద్దులు, పేర్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. మరోసారి తాజాగా రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ ఏడు జోన్లుగా ఏరాటు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు గల పోలీస్స్టేషన్లను హైదరాబాద్ కమిషనరేట్‌లో కలపనున్నారు.
సమస్యాత్మక
గతంలో కమిషనరేట్ పునర్వ్యవస్థీకరించే క్రమంలో హైదరాబాద్‌లో మతపరమైన ఘర్షణలు తలెత్తకుండా సమస్యాత్మక ప్రాంతాలన్నీ ఒకే డివిజన్లో ఉంటే అదుపు చేయడం కష్టమని భావించిన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు వాటిని జోన్ల వారీగా విడగొట్టారు.