చంపాపేట, ఫిబ్రవరి 2ః దేవాదాయ శాఖకు చెందిన భూమిలో కొందరు అక్రమంగా నిర్మించిన ఇండ్లను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు ఖాళీ చేయించి ఆ ఇండ్లను దేవాదాయ శాఖకు స్వాధినం చేశారు. చంపాపేట డివిజన్ పరిధిలో గొప్ప చారిత్రక నేపధ్యం కలిగిన కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయానికి అనుబంధంగా ఉన్న భాన్సూరివాల కృష్ణ మందిరానికి చెందిన స్థలాలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 110లో దేవాలయానికి చెందిన .35 ఎకరాల స్థలం ఉంది. దీనిలోని 20 గుంటల స్థలాన్ని చాల ఏండ్ల క్రితం కొందరు పాట్లుగా చేసి విక్రయించడంతో కొనుగోలు చేసినవారు ఇండ్లు కట్టుకున్నారు. కాబ్జాకు గురైన ఈ స్థలంలో ప్రస్తుతం 21 ఇండ్లు ఉన్నాయి.
అయితే దేవాలయానికి చెందిన ఈ స్థలాన్ని అక్రమంగా కబ్జాచేసి ఇండ్లు కట్టుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఇండ్లల్లో నివాసం ఉంటున్నవారికి, దేవాదాయ శాఖకు మద్య చాలా కాలంగా కేసు కొనసాగుతుంది. ఇటీవల ట్రిబ్యునల్ కోర్టులో దేవాదాయ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా తుది తీర్పు వచ్చే వరకు రూ.3,500 చొప్పున కిరాయి చెల్లిస్తూ ఇండ్లలోనే ఉండటానికి కోర్టు వీలు కల్పించింది. సుమారు 1 సంవత్సరం క్రితమే ఒక ఇంటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 11 మంది మాత్రం కిరాయి చెల్లించడానికి అంగీకరించలేదు. అప్పీల్‌కు కూడా వెళ్లలేదు. దీంతో వారికి ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రిబ్యునల్ జారీ చేసిన ఎవిక్షన్ ఉత్తర్వుల కాల పరిమితి 3నెలలు ముగిసినప్పటికి 11మంది ఇండ్ల నివాసితుల నుండి స్పందన లేదు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున దేవాదాయ శాఖ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి భారీ బందో భస్తుతో ఇండ్ల వద్దకు చేరుకున్నారు.
11ఇండ్లు స్వాధీనం… ఉద్రిక్తత..
అధికారులు తమ ఇండ్లను స్వాధీనం చేసుకోవడానికి రానున్నారన్న సమాచారంతో 11ఇండ్లలోని వారు మందే ఇండ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. తెల్లవారుజామునే ఇండ్ల వద్దకు చేరుకున్న అధికారులు అ ఇండ్ల తాళాలు పగులగొట్టి ఇండ్లలోని సామాగ్రిని తమ సిబ్బందితో బయటకు తరలించారు. అధికారులు ఇండ్ల తాళాలు పగుల గొడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఇండ్ల బాధితులు తమ కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
మరికొందరు అధికారుల తీరును నిరసిస్తూ పెట్రోల్ పోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల మధ్యలోనే అధికారులు 11ఇండ్లను స్వాధీనం చేసుకుని అ ఇండ్లకు సీల్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ కమీషనర్ టి.శేఖర్, ఇన్స్పెక్టర్లు సురేఖ, సురేందర్ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్.లావణ్య, ఆలయ పాలకమండలి చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణరెడ్డి, ఎల్బీనగర్ జోన్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ఇండ్ల బాధితులను ప్రభుత్వం అదుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
35 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం
గత 35 ఏండ్లుగా ఇండ్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్న తమను, ఇప్పుడు ఇది దేవాలయ స్థలమని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు చెప్పడం చాలా అన్యాయమని ఇండ్లలో ఉంటున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో భూగర్భ డ్రౌనేజీ, రోడ్లు, విద్యుత్, తాగునీరు సౌకర్యాలను సైతం ప్రభుత్వమే కల్పించిందన్నారు. ఇలా అర్ధాంతరంగా ఖాళీ చేయాలని చెప్పడం ఎంత వరకు సరైనదని ఇండ్ల బాధితులు వాపోయారు.