బంజారాహిల్స్, జనవరి 17: ‘పార్క్ స్థలం- ప్రైవేటు వైభోగం’ పేరుతో వారంరోజుల కిందట ‘నమస్తే’లో వచ్చిన కథనంపై హైడ్రా అధికారులు ఎట్టకేలకు స్పందించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 32లో సుమారు 300కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్క్ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన నిర్మాణాలను తక్షణమే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. వారం రోజులుగా పార్క్ స్థలంలో నిర్మాణాల వెనక ఉన్నదెవరు.. ఖరీదైన పార్కు స్థలంలో ప్రైవేటు వ్యక్తులు తిష్టవేస్తే జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం అధికారులు ఏం చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నం. 32లోని పార్క్‌ను పరిశీలించారు. బల్దియా పార్క్‌లో ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన గదులను, ఆవుల షెడ్లు, కోళ్ల షెడ్లను, శాశ్వత నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్.. విస్మయానికి గురయ్యారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న సుమారు 2 ఎకరాల పార్క్ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నట్లు గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే పార్క్‌లోని నిర్మాణాలు కూల్చేయాలని ఆదేశించారు. పార్క్‌లోకి రావడం కోసం ఏర్పాటు చేసిన గేట్లను మూసేయాలని, పార్క్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో పార్క్‌లో నిర్మాణాలను తామే కూల్చేస్తామని నిర్మాణదారులు తెలిపారు.