Traffic Police | బంజారాహిల్స్,అక్టోబర్ 23: సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు వాడుతున్న వారిని గుర్తించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వెస్ట్‌జోన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ క్లబ్, బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చౌరస్తా, పంజాగుట్టలోని ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, అమీర్‌పేటలోని మైత్రీవనం.. తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 42 వాహనాలకు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న సైరన్లను తొలగించారు.
రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కొంతమంది మాజీ కార్పొరేటర్లకు చెందిన వాహనాలతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా సైరన్లు ఏర్పాటు చేసుకొని తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించి, వాటిని తీసి వేయించారు. ఈ సందర్భంగా వెస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేవలం పోలీసు అధికారిక వాహనాలు, అంబులెన్స్‌తో పాటు ప్రత్యేక అనుమతి తీసుకున్న వీఐపీల వాహనాలకు మాత్రమే సైరన్లు వినియోగించాల్సి ఉంటుందన్నారు. అయితే, చాలా మంది వీఐపీలు ఇష్టారాజ్యంగా సైరన్లు వాడుతున్నట్లు గుర్తించి, వాటిని తొలగిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి.. తమ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సైరన్లను తొలగించాలని కోరారు.