Chanchalguda Jail | సిటీబ్యూరో/సైదాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): చంచల్‌గూడ జైలులో ఓ రిమాండ్ ఖైదీ రీల్స్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పాతబస్తీకి చెందిన అహ్మద్ జబ్రీ ఈనెల 11న దారి దోపిడీ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడిని కలిసేందుకు స్నేహితులు ములాఖత్ సమయంలో వచ్చారు.
జబ్రీతో కలిసి రీల్స్ చేశారు. జబ్రీ ల్యాండ్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు, విచిత్ర భంగిమలతో చేతులూపడం, హావాభావాలతో జైలులో ఎంజాయ్ చేస్తున్నట్లు షూటింగ్ చేశారు. ఈ వీడియోను ఈనెల 13న అహ్మద్ జబ్రీ అకౌంట్‌తో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో చంచల్‌గూడ జైలు అంటూ అప్లోడ్ చేశారు.
ఈ రీల్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో పోలీసులు రీల్ షూట్ చేసి అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. జైల్లో పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని, ములాఖత్‌లోనే రీల్స్ చేయడం కూడా గమనించని జైలు సిబ్బందిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జైలులో రీల్స్ తీసిన అంశంపై చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ స్పందించారు. ములాఖత్‌కు వచ్చిన వారు దుస్తుల్లో మొబైల్ దాచుకుని వచ్చారని, తాము చెక్ చేసే సమయంలో అవి కనిపించలేదని చెప్పారు. రీల్స్ చేసిన సమయంలో గార్డ్ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారనేది చెక్ చేస్తున్నామని, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, జైలులో ములాఖత్‌కు వచ్చే వారి విషయంలో ఇకపై జాగ్రత్తలు పాటిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.