ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంసీఏ, పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులతో పాటు సోషియాలజీ, సోషల్‌వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషన్, ఎకానమిక్స్, కామర్స్, కెమిస్ట్రీ విభాగాల పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ అధికారులు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16, 17 తేదీలలో నిర్వహించనున్న వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేశారు.
ఓయూ పరిధిలోని ఎంఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి, మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నారు.
ఓయూ పరిధిలోని బీఏఎస్ఎల్పీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని, రూ.500 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించాలని ఓయూ అధికారులు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసినట్లు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ తెలిపారు. డిగ్రీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా వంద మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. జాబితాను ఓయూ వెబ్సైట్లో ఉంచామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 20న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఓరియంటేషన్ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.