సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 29: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి అతి దగ్గర నుంచి ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీశారు. గమనించిన స్థానికులు వారిద్దరిని పట్టుకొని ప్రశ్నించారు. వారిద్దరిపై అనుమానం రావడంతో స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర జరుగుతోందా.. అర్ధరాత్రి సమయంలో అతడి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారా..? ఈ కుట్ర వెనుక ఎవరైనా ఉన్నారా..? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈ నెల 27న అర్ధరాత్రి యూసుఫ్‌గూడకు షేక్ ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా కలిసి నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చి.. రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు ఆ ఇద్దరిని ఆపి ప్రశ్నించారు. ఆ ఇద్దరి ఫోన్లలో రాజాసింగ్ ఇంటి ఫొటోలు, వీడియోలు, గన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్థానికులు ఆ ఇద్దరిని పట్టుకొని మంగళ్‌హాట్ పోలీసులకు సమాచారమిచ్చి అప్పగించారు. పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.