సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, అవినీతికి పాల్పడటం, విధులకు గైర్హాజరు, పర్యవేక్షణ లోపం వంటి వివిధ కారణాలపై నలుగురు విద్యుత్ అధికారులపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌లో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న ఈ.అంబేద్కర్‌పై బదిలీ వేటు వేసి, కార్పొరేట్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. నార్సింగి సెక్షన్ ఆపరేషన్స్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా.. ఇబ్రహీంబాగ్ డివిజన్ ఆపరేషన్స్ విభాగంలో డీఈగా పనిచేస్తున్న శివశంకర్, అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎ.జ్ఞానేశ్వర్ రావుకు చార్జిషీట్ జారీ చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అవినీతికి పాల్పడటం వంటి కార్యకలాపాలకు పాల్పడుతూ.. వినియోగదారులను ఇబ్బంది పెడితే సహించేది లేదని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. ఒకే సర్కిల్ పరిధిలో ఒకేసారి నలుగురు ఉన్నత స్థాయి అధికారులపై సీఎండీ చర్యలు తీసుకోవడంతో విద్యుత్ శాఖలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సర్కిల్ ఎస్ఈ బదిలీలు పూర్తికాగా, మిగతా అధికారుల బదిలీలు జరగాల్సిన సమయంలో క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడంపై అధికారుల్లో భయాందోళన మొదలైంది.