కవాడిగూడ, ఏప్రిల్ 1 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో కులపాలన కొనసాగిస్తున్నదని, అన్ని రకాల పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కల్పిస్తూ బీసీ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యాలయంలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సగం పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీ 17 పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు 5, బీఆర్ఎస్ 6 టికెట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో బీసీలకు కేవలం 3 టికెట్లు మాత్రమే ప్రకటించిందని, ఇది అత్యంత దారుణమని మండిపడ్డారు.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీసీల రాజకీయ భవిష్యత్తుపై చర్చించి రాజకీయ కార్యాచరణ రూపొందించడానికి, బీసీల విధివిధానాలపై చర్చించడానికి ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని వందలాది మంది బీసీ సంఘాల ప్రతినిధులతో బీసీల రాజకీయ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశా చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మనిమంజరి సాగర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, నాయకులు సమతాయాదవ్, ఇంద్రం రజక, మహేశ్ మేరు, తదితరులు పాల్గొన్నారు.