సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): డిప్యుటేషన్లకు జీహెచ్ఎంసీ రెడ్ కార్పెట్ పలుకుతున్నది. రూల్స్ గీల్స్ జాన్తా నహీ..అంటూ అడ్మిన్ విభాగం అనర్హులకు పట్టం కడుతున్నది. ఇప్పటికే ఏండ్ల తరబడి డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న వారికి దాసోహమైన అడ్మిన్ విభాగం.. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సహిస్తున్నది. ప్రత్యేకంగా లేని పోస్టులను సృష్టించి మరీ పదవుల భర్తీ జరుపుతున్నది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిషనర్ (జేసీ) పోస్టులు లేవు. కేవలం జోనల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్లు ఉంటాయి.
హెడ్ ఆఫీస్‌లో జాయింట్ కమిషనర్ల సేవలు అవసరం ఉండదు. కానీ ఇటీవల కాలంలో అడ్మిన్ విభాగంలో ఒక జేసీ, ఈ పోస్టు భర్తీ అయిన కొద్ది రోజుల తర్వాత ఎస్టేట్ విభాగంలో మరో జేసీ పోస్టును డిప్యుటేషన్‌తో భర్తీ చేశారు. ఈ పోస్టుల భర్తీపై ఉద్యోగ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. అడ్మిన్ విభాగం పనితీరు పట్ల రోజు రోజు వివాదాస్పదంగా మారడం గమనార్హం. వాస్తవానికి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఒకే చోట మూడేళ్ల పైబడి ఉండకూడదు. కానీ ఏళ్ల తరబడి కుర్చీని వదలకుండా బల్దియాలోనే కొనసాగుతుండటం అడ్మిన్ విభాగం పనితీరుకు నిదర్శనం.
ఎస్డబ్ల్యూఎం(సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) విభాగంలో ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు (ఈఈ) 8 ఏళ్లకు పైబడి ఒకే పోస్టులో కొనసాగుతున్నాడు. సదరు ఇంజినీరుపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సదరు ఇంజినీరుపై బల్దియాలోని పేరొందిన ప్రముఖ కంపెనీ అండదండలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో వైద్య విభాగంలో ఇద్దరు ఏఎంఓహెచ్‌లు భార్గవ నారాయణ, మైత్రీ ఇద్దరు ఏళ్ల తరబడి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నారు. వీరిని మాతృ సంస్థకు బదిలీ చేసినా వెళ్లకుండా అడ్డదారిలో బల్దియాలోనే కొనసాగుతుండటం విశేషం. కమిషనర్ జోక్యం చేసుకుని డిప్యుటేషన్లపై సమూల ప్రక్షాళన చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.