సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ బాధితుడిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ. 2,91,726 కొట్టేశారు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన బాధితుడికి సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్‌ను వాట్సాప్ నంబర్‌కు పంపించారు. బాధితుడు ఆ ఫైల్‌ను క్లిక్ చేయగానే ఒక సాఫ్ట్వేర్ సెల్ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది. దీంతో బాధితుడికి సంబంధించిన హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు నుంచి రూ. 2,91,726ను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. ఎన్సీఆర్ టీమ్ సహకారంతో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు, సెల్ఫోన్లో ఏపీకే ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసిన వైరస్‌తో కూడిన సాఫ్ట్‌వేర్‌ను గుర్తించి తొలిగించారు. బాధితుడి క్రెడిట్ కార్డును ఉపయోగించి అమెజాన్ యాప్ నుంచి మూడు వస్తువులు వేర్వేరుగా కొన్నట్లు గుర్తించి.. ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా వెంటనే ఆ డబ్బును ఎక్కడికక్కడే ఆయా ఖాతాల్లో ఫ్రీజ్ చేయించారు. ఆ డబ్బును తిరిగి బాధితుడి ఖాతాలోకి రప్పించినట్లు సైబర్‌క్రైమ్స్ డీసీపీ కవిత తెలిపారు.