ఖైరతాబాద్, ఆగస్టు 7 : వాహనాల ప్రవేశానికి తీసుకొచ్చిన కొత్త నిబంధనను నిమ్స్ యాజమాన్యం విరమించుకున్నది. ఈ మేరకు పరిపాలన విభాగం ద్వారా సర్క్యులర్ జారీ అయ్యింది. నిమ్స్‌లోకి వెళ్లాలంటే వన్‌వేను ఏర్పాటు చేశారు. పంజాగుట్ట నుంచి ఎంట్రీ ఇచ్చి, బంజారాహిల్స్ రోడ్ నం.1 మీదుగా ఎగ్జిట్ అయ్యే విధానాన్ని మంగళవారం అమలు చేశారు. అయితే కొత్త నిబంధనల వల్ల కలుగుతున్న ఇబ్బందులను రోగులు, వారి సహాయకులు, ఆస్పత్రి సిబ్బంది యాజమాన్యానికి వివరించారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించి.. పాత విధానంలోనే వాహనాల రాకపోకలు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.
నిమ్స్‌కు రోగులు, వారి సహాయకులు, ఆస్పత్రి సిబ్బంది వాహనాలు కాకుండా ఇతర బయట వాహనాలు నిమ్స్ దారిని బంజారాహిల్స్ నుంచి పంజాగుట్ట, అటు నుంచి తిరిగి బంజారాహిల్స్‌కు వెళ్లేందుకు షార్ట్ కట్ రూట్‌గా వినియోగించుకుంటున్నారు. దీంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాదిరిగా ఎంట్రీ వద్ద వాహనాలను స్కాన్ పద్ధతి ద్వారా రసీదులు అందించి.. తిరిగి వెళ్లే క్రమంలో ఆ రసీదులను నిర్వాహకులకు అప్పగించడం ద్వారా కొంత మేరకు ట్రెస్పాస్లను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై వేటు!
Ghmc
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో అక్రమాలకు పాల్పడిన కూకట్పల్లి సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సంధ్యను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలంటూ.. కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఫాగింగ్ చేయకుండానే బ్లాక్ మార్కెట్‌కు డీజిల్ తరలించిన కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ బాగోతం మూడు రోజుల కిందట బయట పడింది.
అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరించి.. వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందం విచారణ జరుపుతున్నది. ఈ క్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. విజిలెన్స్ విచారణ రిపోర్టు ఆధారంగా ఆమెపై చర్యలు ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా, కూకట్‌పల్లిలో సంధ్య స్థానంలో మరో అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.