సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా.. ఇంకా కమలానికి క్లారిటీ రావడం లేదు. అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతున్నది. మూడు జాబితాలు విడుదల చేసినా ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేకపోయింది. ముఖ్యంగా గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో ఐదు సీట్లు ఇంకా ఖరారు చేయలేకపోయింది. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలోనూ గ్రేటర్లో పూర్తి స్థాయిలో టికెట్లు ఖరారు కాలేదు. దీంతో ఆశావహులు కాషాయం పెద్దలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో 24 స్థానాల్లో 19 స్థానాలకు మాత్రమే సీట్లు ఖరారు చేసింది. జనసేన పొత్తు కూడా కాషాయంలో చిచ్చు పెట్టింది. గ్రేటర్లో అధిక స్థానాలు తమకే కేటాయించాలని పవన్ కల్యాణ్ పట్టుబట్టడంతో బీజేపీ కొన్ని స్థానాలను ప్రకటించలేకపోతున్నది. ఇప్పటికే ఆ స్థానాల నుంచి దరఖాస్తు చేసుకున్న ఆశావహులు జనసేన పొత్తును వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బీజేపీ గ్రేటర్లో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, నాంపల్లి, కంటోన్మెంట్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే ఈ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పార్టీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆశావహులంతా నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు.
అంబర్పేట్ నుంచి కృష్ణ యాదవ్‌కు టికెట్ ఇవ్వడంపై బీజేపీ కోసం ఇన్నేండ్లు పనిచేసిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతం రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి అంబర్పేట్ నుంచి టికెట్ ఆశించారు. కానీ వారిని బీజేపీ పట్టించుకోలేదు. ప్యారా షూట్ నేతకు టికెట్ ఇచ్చారంటూ వారంతా పెదవి విరుస్తున్నారు. గతంలో కృష్ణ యాదవ్ స్టాంపుల కుంభకోణంలో అరెస్టయిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు గోషా మహల్ కేటాయిస్తామని చెప్పి రాజాసింగ్‌కు అప్పగించడంతో అతనికి జూబ్లీహిల్స్ కేటాయిస్తామని మాటిచ్చారు. కానీ చివరికి జూబ్లీహిల్స్‌ను కూడా దీపక్ రెడ్డికి కేటాయించడంతో బీజేపీ ఆయనకు కూడా మొండిచెయ్యిచ్చింది.