ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉన్నది… ప్రభుత్వ పెద్దలు ఈ ఊరడింపు మాటలు క్షేత్రస్థాయిలో రియల్ రంగానికి మాత్రం ఉపశమనం కలిగించడం లేదు. ఇతర నగరాల కంటే వేగంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ మార్కెట్ ఢమాల్ అంటున్నది. బడా సంస్థలు మొదలు కాలనీల్లో ఉండే చిన్న బిల్డర్ వరకు… కార్పొరేట్ సంస్థల్లోని రియల్ మార్కెట్ సంస్థల నుంచి గల్లీలో ఉండే రియల్ బ్రోకర్ దాకా ప్రస్తుత మార్కెట్‌ను చూసి విలవిలలాడుతున్నాడు. ఈ వాస్తవాలకు అద్దం పడుతూ అన్‌రాక్ సంస్థ నివేదిక వెలువడింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రియల్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనే వివరాలను 2024 తొలి త్రైమాసికంతో పోలుస్తూ నివేదిక ఇచ్చింది. ఇందులో గతేడాది పోలిస్తే అమ్మకాలు ఏకంగా 49 శాతానికి పడిపోయినట్లు తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర మార్కెట్లో ఇప్పటికిప్పుడు అమ్ముడుపోకుండా దాదాపు లక్ష ఫ్లాట్లు సిద్ధంగా ఉండటం గమనార్హం.
మరోవైపు అపార్టుమెంట్లల్లో నివాస-ఉమ్మడి ప్రదేశాలకు సంబంధించి రెరా కచ్చితమైన మార్గదర్శకాలు, నిబంధనల్ని రూపొందించకపోవడంతో కోట్లు పెట్టి కొంటున్న వినియోగదారులకు వెచ్చిస్తున్న దానిలో 62 శాతం మేరకే నివాస ప్రాంతం వస్తున్నట్లు అన్‌రాక్ నివేదికలో వెల్లడైంది. 2019లో ఇది 70 శాతం వరకు ఉంటే క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
దయనీయంగా..
దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా వంటి ఏడు మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థితిగతులపై అన్‌రాక్ సర్వే చేపట్టింది. ప్రధానంగా హైదరాబాద్‌కు సంబంధించి మార్కెట్ పరిస్థితి దయనీయంగా ఉన్నట్లుగా నివేదిక ద్వారా అర్థమవుతున్నది. గత ఏడాదిన్నరగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు… రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు సైతం గణనీయంగా తగ్గిందనేది అందరికీ తెలిసిన సత్యమే.
ఈ నేపథ్యంలో లక్షలాది కుటుంబాలు ఆధారపడే హైదరాబాద్ మహా నగర రియల్ రంగం పరిస్థితి నానాటికీ దిగజారుతుండటంతో అనుబంధ రంగాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తున్నది. అన్‌రాక్ నివేదికను పరిశీలిస్తే… 2024 తొలి త్రైమాసికంతో పోలిస్తే కొత్త యూనిట్ల ప్రారంభంలోనే 55 శాతం తగ్గుదల నమోదైనట్లు తేలింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో కేవలం 13,900 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. అమ్మకాలను చూస్తే… ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10వేల యూనిట్లు అమ్ముడవగా, 2024 మొదటి మూడు నెలలతో పోలిస్తే అది 49 శాతానికి పడిపోవడం గమనార్హం. దీంతో మార్కెట్లో పెద్ద ఎత్తున అపార్టుమెంట్లల్లో ఫ్లాట్లు అమ్ముడుపోక అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఇప్పటికిప్పుడు (నివేదిక వచ్చే సమయానికి) హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా 97,950 యూనిట్లు అమ్మకానికి ఉన్నట్లుగా తేలింది.
చెరిపేస్తే చెరగని డిమాండు…
ఆది నుంచి హైదరాబాద్ మహా నగరంలో వెస్ట్ సిటీకి డిమాండు భారీగా ఉంటుంది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడంతో పాటు హైడ్రా, ఇతర శాఖల కూల్చివేతలు కూడా ఆ పరిధిలోనే ఎక్కువగా జరిగాయి. ఇదే సమయంలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధుల్లో సీఎం రేవంత్ ఫోర్త్ సిటీని ప్రకటించారు. పెద్ద ఎత్తున కంపెనీలకు కేటాయింపులు చేయడంతో పాటు అనేక ప్రాజెక్టుల్ని అక్కడ ప్రకటించారు.
ఇక భవిష్యత్తు అంతా ఫోర్త్ సిటీలోనే ఉంటుందని చెప్పారు. కానీ రియల్ మార్కెట్ మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదని అన్‌రాక్ నివేదిక ద్వారా తెలుస్తున్నది. మహా నగరంలో ప్రారంభమైన కొత్త యూనిట్లలో ఏకంగా 82 శాతం వెస్ట్ సిటీ గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్పల్లి, అత్తాపూర్, కోకాపేట, పటాన్చెరు, మాదాపూర్, అప్పా జంక్షన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కొద్దోగొప్పో జరిగిన అమ్మకాల్లోనూ వెస్ట్ సిటీలో 55 శాతం ఉంటే… ఉత్తరం అంటే మియాపూర్, పోచారం, బాచుపల్లి, నిజాంపేట, బొల్లారం, యాప్రాల్, శామీర్‌పేట ప్రాంతాల్లో మరో 26 శాతం నమోదయ్యాయి. అంటే మార్కెట్లో 81 శాతం ఈ రెండు ప్రాంతాలకే పరిమితమైంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలోనూ 62 శాతం వెస్ట్ సిటీలో ఉంటే 24 శాతం నార్త్ సిటీలో ఉంది.
కుచించుకుపోతున్న నివాస పరిధి…
సాధారణంగా మనం అపార్టుమెంట్లల్లో కొనుగోలు చేసే ఫ్లాట్లల్లో నికర నివాస పరిధి (లివబుల్ స్పేస్-కార్పెట్ ఏరియా)తో పాటు కామన్ ఏరియాతో కలుపుకొని ధరను చెల్లిస్తాం. మనం చెల్లించే డబ్బుల్లో కామన్ ఏరియా అంటే ఎలివేటర్స్ లాబీలు, మెట్లు, క్లబ్‌హౌజ్‌లు, పార్కింగ్వంటి వసతులు (ఎమినిటీఎస్), టెరస్ వంటివి కూడా ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఈ కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా తేలింది.
ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలో వినియోగదారులకు నివాస పరిధి (కార్పెట్ ఏరియా) 2019 సంవత్సరంలో 70 శాతం దాకా ఉండేది. కానీ తాజాగా అది సరాసరిన 62 శాతానికి పడిపోయినట్లుగా అన్‌రాక్ నివేదికలో తేలింది. అయితే మనతో పోలిస్తే బెంగళూరులో ఇది ఇంకా ఘోరంగా ఉంది. 2019లో అక్కడ కార్పెట్ ఏరియా 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు అది 59 శాతానికి పడిపోయింది. అంటే కామన్ ఏరియా 41 శాతంగా ఉంది.