హైదరాబాద్: టమాటాలతో కొట్టుకునేందుకు ఉత్సాహం చూపే వారు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ పిలుపునిచ్చింది. మే 11న ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో టమోటా ఫెస్టివల్ (tomato festival) నిర్వహించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. స్పెయిన్‌లో ప్రతి ఏటా జరిగే ఐకానిక్ లా టమాటినా స్ఫూర్తితో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే హైదరాబాద్ వెర్షన్ మ్యూజిక్, డాన్స్, క్యూరేటెడ్ ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన ఈ టమాటా ఫెస్ట్‌ను భిన్నమైన స్థానిక టేస్ట్‌తో ఆస్వాదించవచ్చని వివరించింది.
కాగా, టమాటాలతో కొట్టుకునే ఈ ‘టమాటో ఫైట్’ కోసం భారీగా టమాటాలు సేకరిస్తున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. అలాగే ఈ లైవ్ కార్యక్రమంలో డీజే మ్యూజిక్, డ్యాన్స్ జోన్లతో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయని చెప్పారు. పండుగ, కార్నివాల్ లాంటి ఆహ్లాదకర వాతావరణాన్ని తలపించేలా ఈ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు 2011 నాటి బాలీవుడ్ చిత్రం ‘జిందగీ నా మిలేగీ దోబారా’లో టమాటా ఫైట్ చూసిన తర్వాత దేశంలో కూడా ఈ తరహా ఈవెంట్లకు ఆదరణ పెరిగింది. అయితే 2013లో ప్రతిపాదించిన లా టొమాటినా తరహా కార్యక్రమంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో టమాటా ఫెస్టివల్ వ్యర్థాలను ఎరువుగా మార్చి ఈవెంట్ జరిగే గార్టెన్‌కు వినియోగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.