దుండిగల్, నవంబర్ 20: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేజ్-4లోని అరోర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సూరారం కాలనీకి చెందిన అనిల్(41), బలరాం, చింతల్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి క్యాజువల్ కార్మికులుగా, గోపీచంద్ కెమిస్టుగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం రోజువారీ మాదిరిగానే తోటి కార్మికులతో కలిసి విధుల్లో చేరారు. అనిల్, శ్రీనివాస్‌రెడ్డి, బలరాం పరిశ్రమలోని బాయిలర్‌ను శుభ్రం చేస్తుండగా రియాక్టర్ పేలింది.
ఈ ప్రమాదంలో అనిల్, బలరాం, శ్రీనివాస్‌రెడ్డితో పాటు అక్కడే ఉన్న కెమిస్ట్ గోపీచంద్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. పరిశ్రమ యాజమాన్యం వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అనిల్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురు బలరాం, గోపీచంద్, శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.
కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన అనిల్(41) ఏపీలోని కర్నూల్‌కు చెందిన వాసిగా గుర్తించారు. గత రెండేండ్లుగా భార్యా, ఇద్దరు కూతుళ్లతో కలిసి సూరారం కాలనీలో ఉంటూ.. అరోర్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో క్యాజువల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం గుట్టుగా ఉంచింది. కుటుంబసభ్యులకు తెలియకుండానే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంపై మృతుడి బంధువులు పరిశ్రమ ఆవరణలో ఆందోళన చేపట్టారు.
పరిశ్రమ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిశ్రమ ఆవరణలో కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బాధితుల కుటుంబసభ్యులతో పాటు పత్రికా ప్రతినిధులను సైతం పరిశ్రమయాజమాన్యం లోనికి అనుమతించలేదు. గేటు బయటే అడ్డుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై బాధిత కుటుంబాల నుంచి గానీ, పరిశ్రమ యాజమాన్యం నుంచి గానీ ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఇన్స్పెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు.