SPDCL | సిటీబ్యూరో/ శేరిలింగంపల్లి, మే 2(నమస్తే తెలంగాణ): ఖాజాగూడా చిత్రపురికాలనీలో చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు, దుండిగల్ పోలీసులు కలిసి స్థానిక ప్రభుత్వ స్థలంలో వేణుగోపాల్ అనే వ్యక్తి నిర్మించిన రేకుల ఇంటిపై దాడి చేసి 30 మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి నంబర్లు, పత్రాలు లేకుండానే కరెంటు మీటర్లను పొందినట్లు తేలింది. ప్రభుత్వ స్థలంలోని ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు కరెంట్ మీటర్లను వాడడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
సాధారణంగా విద్యుత్ మీటర్ పొందాలంటే స్థలం రిజిస్టేష్రన్ డాక్యుమెంట్, ఇంటి నంబర్, నిర్మాణ అనుమతుల పత్రాలను సమర్పించాలి. రూ. 3వేలు చెల్లించి..మీటర్ పొందొచ్చు. కానీ కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు అధికారులు.. నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా
దొడ్డిదారిన ఒక్కో మీటర్‌కు రూ.15వేల నుంచి రూ.18వేలు అవసరమైతే రూ.20వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీటర్లకు మీటర్లే కనిపించకుండాపోవడం ఇప్పుడు విద్యుత్ శాఖను కుదిపేస్తున్నది. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న ఇటువంటి ఘటనలతో ఆ శాఖలో భారీ అవినీతి
బయటపడుతున్నది.
ఖాజాగూడా చిత్రపురికాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 42 విద్యుత్ మీటర్లను రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా దాచిన చెన్నకేశవరెడ్డి అనే కాంట్రాక్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖలో విద్యుత్ మీటర్ల గోల్ మాల్ వ్యవహారంపై ఇబ్రహీంబాగ్ ఏడీఈ
అంబేద్కర్ గురువారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిలీజ్ అయిన సర్వీస్‌లకు సంబంధించిన మీటర్లు ఓ ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి చేరుకునే సమయానికి వాటిని మరో ప్రాంతానికి తరలించినట్లు ఏడీఈ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు ఖాజాగూడ చిత్రపురి కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 42 విద్యుత్ మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డి ఈ విద్యుత్ మీటర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు.
అసలు మీటర్లు చెన్నకేశవరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరిచ్చారు… ఒకేసారి ఇన్ని మీటర్లు ఎందుకు అక్రమంగా నిల్వ చేశారు. 24 గంటల్లో బిగించాల్సిన మీటర్లు ఎందుకు అక్రమంగా దాచి ఉంచారు.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా తమకు మీటర్లు తక్కువ పడడంతో పాటు చాలా మీటర్లు రిటర్న్ రాకపోవడంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అధికారులు చెప్పారు. అయితే దొరికిన మీటర్లు గచ్చిబౌలి డివిజన్‌కు చెందినవిగా అధికారులు చెబుతుండగా, మరి ఇబ్రహీంబాగ్‌లో కనిపించకుండా పోయిన మీటర్లు ఎక్కడున్నాయనేది ఇప్పుడు మరో వివాదమైంది. ముఖ్యంగా మీటర్ల మిస్సింగ్, ఆ తర్వాత పెద్ద ఎత్తున దొరకడంతో ఇలా ఇంకెన్ని చోట్ల ఉన్నాయనే కోణంలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. శివారు ప్రాంతాల్లోనే ఈ తరహా గోల్మాల్ సంఘటనలు జరిగి ఉంటాయని, అసలు ఉన్న మీటర్లు ఎన్ని.. మిస్ అవుతున్నవెన్ని.. అనే అంశాలతో సవివరంగా తమకు నివేదిక తెప్పించుకోవాలని, దీనిపై సీఎండీతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని విజిలెన్స్ అధికారి ఒకరు చెప్పారు.
మీటర్లు మా దగ్గర మిస్ అయిన విషయాన్ని గమనించి మా పై అధికారులకు తెలిపాం. విజిలెన్స్ అధికారులు విచారణ చేసే క్రమంలోనే టెలీకంనగర్లో ఉన్న మీటర్లను మరో చోటికి మార్చినట్లు తెలిసింది. దీంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించి 42 మీటర్లను రాయదుర్గంలోని టెలీఫోన్కాలనీలోని ఓ ఇంటిలో పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో చెన్నకేశవరెడ్డి అనే కాంట్రాక్టరే మీటర్లు ఒకచోట నుంచి మరోచోటకు మార్చారని తెలిసింది. అసలు నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఎలా పొందారనే విషయంపై పోలీసులతో పాటు మా శాఖ తరపున విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నాం. మీటర్ ఇచ్చేటప్పుడు లైన్మెన్, ఇన్స్పెక్టర్ టెస్ట్ రిపోర్ట్‌ను ఏఈకి పంపాలి. వీటిని ఏఈ అనుమతి ఇచ్చిన తర్వాత మీటర్లు ఇస్తారు. 42 మీటర్లు ఎలా తీసుకెళ్లారనే విషయంలో సర్వీస్ నంబర్, ఇంటి నంబర్లతో సహా ప్రతీ అంశాన్ని పరిశీలించి విచారిస్తున్నాం.
– అంబేద్కర్, ఏడీఈ, ఇబ్రహీంబాగ్