SPDCL | సిటీబ్యూరో : దక్షిణ డిస్కం చరిత్రలో లేనివిధంగా కరెంటు మీటర్లు మాయం కావడం, మళ్లీ ఎక్కడో ఒక దగ్గర ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఇబ్రహీంబాగ్ డివిజన్లో దాదాపు వంద మీటర్లు కనిపించడం లేదంటూ ఏడీఈ అంబేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుపుతున్న క్రమంలోనే గచ్చిబౌలిలోని టెలీకాంనగర్లోని ఓ ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన 42 మీటర్లను కనిపెట్టారు. ఇబ్రహీంబాగ్‌లో వినియోగదారుల పేరిట మంజూరైన మీటర్ల రీడింగ్ కోసం వెళ్తే అక్కడ మీటర్లు లేవు. సదరు సర్వీస్ మీద ప్రతినెలా మినిమమ్ బిల్లు వస్తున్నది.
ఈ విషయమై అనుమానం వచ్చిన డివిజనల్ స్థాయి అధికారులు విచారణ చేపట్టి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే టెలీకాంనగర్లో 42 మీటర్లు బయటపడ్డాయి. వీటిని చిత్రపురి కాలనీలో నిర్మిస్తున్న విల్లాల కోసం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కాగా, సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సీరియస్ కావడంతో పాటు బాధ్యులైన అధికారులపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.