హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపకశాఖకు ఏ రాష్ట్రంలో లేనట్టుగా అత్యాధునిక సామగ్రిని సమకూర్చామని రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రవిగుప్తా అన్నారు. అగ్నిమాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన అగ్నిమాపక వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అగ్నిమాపకశాఖ దక్షిణాదిలోనే తొలిసారిగా రోబోలను సమకూర్చుకున్నదని తెలిపారు.
ప్రజలు, మూగజీవాల ప్రాణాలు కాపాడటంతోపాటు, ప్రజా ఆస్తులను రక్షించేందుకు నూతనంగా కొనుగోలు చేసిన యంత్ర సామగ్రి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాల నివారణ సమష్టి బాధ్యత అని చెప్పారు. ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతివారం అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
నిరుడు సుమారుకి 8,500కి పైగా ఫైర్‌కాల్స్ వచ్చాయని, ప్రమాదాలను నివారించేందుకు నీటిడ్రమ్ములను అందుబాటులో ఉండేలా భవన యజమానులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫైర్వీక్ ముగింపు కార్యక్రమం ఆదివారం జరుగుతుందని ఆ రోజున 5కే రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జీవీ నారాయణరావు, అడిషనల్ ప్రసన్నకుమార్, డిప్యూటీ డైరెక్టర్ బీ సుధాకర్‌రావు, డీఎఎఫ్వోలు, ఏడీఎఫ్‌వోలు సిబ్బంది పాల్గొన్నారు.