సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు రాకేష్‌రెడ్డికి చెందిన ‘కే చంద్రశేఖర్‌రెడ్డి’ పేరుతో గల రిసార్ట్‌లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు కొరఢా ఝలిపించారు. ఈ రిసార్ట్‌లో రేవ్ పార్టీ, ముజ్రా డ్యాన్స్‌తో పాటు క్యాషినో(పేకాట క్లబ్) కూడా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రిసార్ట్స్‌లో కొనసాగుతున్న రేవ్‌పార్టీని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు, మహేశ్వరం పోలీసులు సంయుక్తంగా భగ్నం చేసిన విషయం తెలిసిందే. తదనంతరం పోలీసుల విచారణలో సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి ఈ రిసార్ట్స్‌లో క్యాషినో కాయిన్స్ కూడా లభించినట్లు ఆరోపణలు వచ్చాయి, అయితే పోలీసులు క్యాషినో కాయిన్స్ లభించలేదని అంటున్నారు.
విత్తనాల డీలర్లకు పార్టీ ఇచ్చేందుకు..
ఇదిలాఉండగా గాజులరామారంలో వేద అగ్రి ఇన్వరేషన్ పేరుతో తిరుపతిరెడ్డి, ఇబ్రహీంపట్నం రాందాస్ పల్లిలో రాక్‌స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలు తయారు చేస్తున్నారు. తమ ఉత్పత్తులను భారీగా విక్రయించుకోవడంలో భాగంగా విత్తనాల డీలర్లకు పార్టీ (విందు) ఇచ్చేందుకు తిరుపతిరెడ్డి, సైదారెడ్డి మంగళవారం రాత్రికి కాంగ్రెస్ నాయకుడు రాకేష్‌రెడ్డికి చెందిన రిసార్ట్‌ను కిరాయికి తీసుకున్నారు. ఈ పార్టీకి డీలర్లతో పాటు 56 మంది పురుషులు హాజరయ్యారు. డ్యాన్స్, ముజ్రా చేసేందుకు 20 మంది యువతులను రప్పించారు. మద్యంతో పాటు పెద్ద సౌండ్ సిస్టమ్స్‌తో హంగామా చేస్తుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్‌పై దాడిచేసిన విషయం తెలిసిందే. అయితే రిసార్ట్‌లో ఎలాంటి క్యాషినో కాయిన్స్ లభించలేదని, అదుపులోకి తీసుకున్న 20 మంది యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించామని, రిసార్ట్స్ నిర్వాహకుడు, మేనేజర్‌తో పాటు 56 మందిని అరెస్ట్ చేసినట్లు మహేశ్వరం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.