సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై నిర్వహించిన సమావేశంలో కర్ణన్ వివరాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు ఉన్న 320 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. అదనంగా 79 కొత్త పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రేషనలైజేషన్ నివేదికను ఈనెల 28వ తేదీలోగా ఈసీకి పంపించాల్సి ఉన్నందున,అభ్యంతరాలను 26వ తేదీలోగా సమర్పించాలని కమిషనర్ సూచించారు.
ఏజెంట్ల జాబితా ఇవ్వాలి..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) అందుబాటులో ఉన్నారని కమిషనర్ తెలిపారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా సమర్పించాయని, ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన 79 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులను త్వరలోనే నియమిస్తామని చెప్పారు.
3,767 ఓటర్ దరఖాస్తులు రిజెక్ట్..
జనవరి 6 నుంచి ఆగస్టు 15 వరకు మొత్తం 19,237 ఓటర్ల నమోదు దరఖాస్తులు అందగా, అందులో 3,767 తిరసరించబడ్డాయని, ఇంకా 16 పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అదనపు కమిషనర్ మంగతాయారు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఈవోఆర్ రజనీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నందేష్ కుమార్, బీజేపీ నుంచి వెంకటరమణ, పవన్ కుమార్, సుప్రియ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజయ్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్సిస్టు) నుంచి శ్రీనివాసరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి రాజేష్ కుమార్, టీడీపీ నుంచి శ్రీకాంత్, విజయ రత్న, ఏఐఎంఐఎం నుంచి సయ్యద్ ముస్తాక్ కలియుల్లా తదితరులు పాల్గొన్నారు.
నోడల్ అధికారుల నియామకం..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను చేసేందుకు నోడల్ అధికారులను నియమిస్తూ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌కు ఈవీఎం, వీవీప్యాట్ నిర్వహణ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు ట్రైనింగ్ బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌పోర్టు మేనేజ్మెంట్ సీటీవో శ్రీనివాస్, మెటీరియల్ మేనేజ్మెంట్ అడ్మిన్ అదనపు కమిషనర్ కే వేణుగోపాల్, ఎంసీసీ అదనపు ఎస్పీ సుదర్శన్‌కు అప్పగించారు.
లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఖర్చుల పర్యవేక్షణ చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర రెడ్డి, ఎన్నికల పరిశీలకులు అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు డమ్మీ బ్యాలెట్ పేపర్, సీపీఆర్వో సెక్షన్ పీఆర్వో దశరథ్కు మీడియా కమ్యూనికేషన్, ఎంసీఎంసీ, ఐటీ జాయింట్ కమిషనర్ రాధాకు సైబర్ సెక్యూరిటీ ఐటీ, కంప్యూటరైజేషన్, ఐటీ ఏఈ కార్తీక్ కిరణ్‌కు హెల్ప్‌లైన్, ఐటీ ఏఈ తిరుమల కుమార్‌కు వెబ్ కాస్టింగ్ బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నిక ఏర్పాట్లను వేగవంతం చేశారు.