మన్సూరాబాద్, అక్టోబర్ 23: డెంగ్యూతో తీవ్రంగా ఊపిరితిత్తులు దెబ్బతిని.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ఎల్బీనగర్ కామినేని దవాఖాన వైద్యులు ప్రాణం పోశారు. ఎక్మో సహాయంతో ఆరు రోజుల పాటు చికిత్సను అందించి.. అతడు కోలుకునేలా చేశారు. ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కె. వెంకటరమణ, డాక్టర్ శృంగల దేవిజన్ వివరాలు వెల్లడించారు.
నగరంలోని నాచారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (51)కి డెంగ్యూ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఆక్సిజన్ శాచ్యురేషన్ పడి పోవడంతో చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్పించే సమయంలో అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి.. ఎక్మో అమర్చి చికిత్సను ప్రారంభించారు. వైద్యుల శ్రమ ఫలితంగా అతడు ఆరు రోజుల్లోనే కోలుకోగా.. తొమ్మిది రోజుల అనంతరం అతడిని డిశ్చార్జి చేశారు.