ఖైరతాబాద్, జూలై 14: ఉపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న రోగికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు నిమ్స్ వైద్యులు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కచ్చాపూర్కు చెందిన రాచకొండ శివప్రసాద్ రావు కొంతకాలంగా ఊపిరితిత్తులతో పాటు గుండె సమస్యలతో బాధపడుతున్నాడు. అనేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఇటీవల నిమ్స్ దవాఖానలో వైద్యులను సంప్రదించాడు. శివ ప్రసాద్‌కు వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడు క్రానిక్ త్రాంబో ఎంబోలిక్ పల్మనరీ హైపర్ టెన్షన్, ట్రైక్యూస్పిడ్ రీగర్జిటేషన్ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
కార్డియో థోరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్వర రావు, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ సూర్య సత్య గోపాల్ నేతృత్వంలో వైద్యుల బృందం అతడికి రెండు శస్త్రచికిత్సలను చేసి సమస్యను సరిచేశారు. ప్రస్తుతం రోగి క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ అమరేశ్వర రావు తెలిపారు.