మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 1: ఆరాంఘర్ చౌరస్తాలో అంతర్రాష్ట్ర బస్ టర్మినల్‌ను నిర్మించాలని రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి, సిటిజన్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షుడు అనంతమోహన్ మాట్లాడుతూ.. కాటేదాన్ గ్రామ సర్వే నంబర్ 54, 55, 56లో మొత్తం 16 ఎకరాల 20 గుంటల భూమిని 1964లో ఉమ్మడి ప్రభుత్వం ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్‌కు కేటాయించిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత అందులో ఉన్న వృద్ధులను వేరే ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు.
కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారన్నారు. దీంతో అప్పట్లో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన డీఎస్ లోకేశ్‌కుమార్ ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా రెవెన్యూ అధికారులతో సర్వే నంబర్ 54/2, 55/2 ఆరాంఘర్ చౌరస్తాలోని నేషనల్ హైవే 44కు అనుకొని ఉన్న భూమిని మ్యాపింగ్ వేసి సర్వే చేయించినట్లు పేర్కొన్నారు. అధికారుల నివేదిక ఆధారంగా 2018లో ఆర్టీసీకి ఏడెకరాల 22 గుంటలను ఆధీనంలోకి తీసుకొని.. అంతర్రాష్ట్ర బస్ టర్మినల్‌ను నిర్మించాలని రాతపూర్వకంగా టీఎస్ఆర్టీసీ ఎండీకి పంపించారని చెప్పారు.
అయినా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే అంతర్రాష్ట్ర బస్ టర్మినల్ బస్టాండ్ నిర్మించాలని, దీనివల్ల బెంగళూరు, తిరుపతి, కర్నూలు మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. మిగిలిన 8 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమిలో కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆనంద్, సాయిలు, మహ్మద్ ఖాజా, సత్యం, బాల్‌రాజ్, జగన్, కృష్ణారెడ్డి, రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.