సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని జేమ్స్ స్ట్రీట్‌లో రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ భవనాన్ని మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ సందర్శించి మరమ్మతు పనులను పర్యవేక్షించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ భవనానికి మరమ్మతులు నిర్వహించి హైదరాబాద్ సిటీపోలీసులకు తిరిగి అప్పగిస్తున్నారని ఆనంద్ తెలిపారు.
జేమ్స్ స్ట్రీట్ పీఎస్ భవనం 1900 సంవత్సరంలో నిర్మించారని, 116 సంవత్సరాల పాటు రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌గా సేవలందించిందని, తాను డీసీపీ సెంట్రల్ జోన్‌గా ఉన్నప్పుడు ఈ భవనం నుంచే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. రానున్న కొద్దిరోజుల్లో రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వస్తువులను తిరిగి ఈ భవనంలోకి తరలించి త్వరలోనే ప్రారంభోత్స వం చేయిస్తామని చెప్పారు.
అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వాటి పార్కింగ్ సదుపాయం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ సిటీపోలీస్కు సంబంధించిన పురానాహవేలిలోని కమిషనర్ కార్యాలయానికి మరమ్మతులు చేయిస్తున్నామని, అది కూడా త్వరలో ప్రారంభించిన తర్వాత ప్రతి శుక్రవారం తాను అక్కడి నుంచే విధులు నిర్వహిస్తానన్నారు. కార్యక్రమంలో నార్త్‌జోన్ డీసీపీ ఎస్.రశ్మిపెరుమాల్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌హెగ్డే తదితరులు పాల్గొన్నారు.