హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియా సమావేశంలో వాటర్ వర్క్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి గా టీఆర్ఎస్ అనుబంధ సంఘం నుంచి బరిలో ఉన్న రాంబాబు యాదవ్ తో కలిసి మాట్లాడారు. వాటర్ వర్క్స్ బోర్డ్ లోని ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న రాంబాబు యాదవ్ ను ఈ నెల 26 వ తేదీన జరిగే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి చెందిన అభ్యర్థిని గెలిపించుకోవడం వలన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు. గతంలో GHMC పరిధిలో నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడం వలన ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టే చర్యలు, వాటర్ వర్క్స్ బోర్డ్ లోని ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న కారణంగానే సాధ్యమైందని చెప్పారు. కరోనా సమయంలో కూడా వాటర్ వర్క్స్ ఉద్యోగులు ఎంతో ధైర్య సాహసాలతో విధులు నిర్వహిస్తూ నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పని చేశారన్నారు.
వీరి సేవలకు గుర్తింప గా ప్రభుత్వం 7,500 రూపాయల ఇన్సెంటివ్ ను అందజేసిన విషయాన్ని తెలిపారు. గతంలో వాటర్ వర్క్స్ బోర్డ్ లోని ఉద్యోగుల వైద్య పరమైన పరిరక్షణ కోసం 2 కోట్ల రూపాయల కేటాయింపు ఉండగా, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో 7 కోట్ల రూపాయలను పెంచారన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం ఉన్నదని, ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నదని అన్నారు. ఉద్యోగుల బాగోగులు, అభివృద్ధి చూడాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. భవిష్యత్ లో వాటర్ వర్క్స్ బోర్డ్ లో నూతన నియామకాలు చేపట్టడంతో పాటు, వైద్య పరమైన నిధులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.