Rajendra Nagar | మైలార్‌దేవ్‌పల్లి, ఫిబ్రవరి 13: ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్‌గౌడ్ చెప్పారు. గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ జంక్షన్ మధ్యలో ఉన్న డ్రైనేజీ పైపులైన్ రోడ్డు పక్కన నుంచి వేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ ఈఈ నరనేందర్గౌడ్, ఏఈ నర్సింహ్మమూర్తిలతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రైనేజీ పైపులైన్ డెవలప్మెంట్కు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు.
డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం జరిగే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని రాజేందర్ గౌడ్ తెలిపారు. వాహనదారులు అభివృద్ధి పనులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని యూటర్న్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకుని సమస్య లేకుండా చూస్తామని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.