Congress | మణికొండ, అక్టోబర్ 10 : దేశ రాజధాని ఢిల్లీలో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ స్థాయిలో తర్జనభర్జనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. టికెట్ కోసం ఎవరు అధికంగా పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలకు ముడుపులు సమర్పించుకుంటే వారికే టికెట్ వరించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేనే మరోసారి బరిలోకి దించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ స్పష్టతలేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా దిక్కులు చూస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 11మంది ఆశావాహులు ఎమ్మెల్యే టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తులు చేసుకోగా.. వారిలో నుంచి పీసీసీ స్థాయి కమిటీ వడపోత చేపట్టి ముగ్గురి పేర్లను ఏఐసీసీకి పంపినట్లు సమాచారం. వారిలో టికెట్ ఎవరికి వస్తుందో తెలియక.. ఆశావాహులు కనీసం ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు, కార్యకర్తలను కలిసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో కార్యకర్తలు డోలాయమానంలో ఉన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్‌ను ఆశిస్తున్న ముగ్గురిలో ఎవరు అధికంగా అధిష్టానానికి ముడుపులు చెల్లిస్తారో వారికే టికెట్ కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలిసింది. నియోజకవర్గానికి ఉన్న స్థాయిని బట్టి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కేటాయించేందుకు ఏకంగా రూ.25కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఓ రాష్ట్ర స్థాయి ప్రముఖనేత ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. పార్టీ పరంగా చేయించుకున్న సర్వేలలో ఉత్తమ అభ్యర్థిగా తేలినా.. డబ్బులిచ్చేవారికే టికెట్ కేటాయించాలనే ప్రయత్నం చేస్తున్న నేతలపై సొంత పార్టీలో కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. అయితే ఒకవేళ డబ్బులిచ్చి టికెట్ పొందితే వారికి ఏ స్థాయిలో క్యాడర్ పనిచేస్తుందో.. లేదో..? అర్థం కాని పరిస్థితి. అంతేకాక ముగ్గురిలో ఒక్కరికి టికెట్ కేటాయించినా.. మిగతా వారు కలిసి పనిచేస్తారా? అన్నది సందేహంగానే మిగిలింది. నియోజకవర్గం వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తుండటం, వీరంతా కలిసి పనిచేస్తారన్న నమ్మకం లేకపోవడంతో కోట్లాది రూపాయలు ముడుపులు చెల్లించి టికెట్ పొంది గెలుస్తామా అనే సందేహంలో అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ టికెట్ కోసం బొర్ర జ్ఞానేశ్వర్, కస్తూరి నరేందర్, గౌరీ సతీష్ పేర్లు ఏఐసీసీకి చేరాయి. ఈ ముగ్గురిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్, ప్రముఖ విద్యావేత్త టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకరు రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, మరోసారి తనకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ పట్టుబట్టారు. తాను సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ కావడంతో ఆర్థికంగా, అన్నివిధాలుగా బాగున్నానని, క్యాడర్ అంతా తనవెంటే ఉందని అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కాగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత గౌరీ సతీష్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతుండగా నియోజకవర్గంలో విద్యావంతులే అధికంగా ఉండటంతో తనకే టికెట్ కేటాయిస్తే ప్రత్యర్థికి గట్టి పోటీని ఇచ్చి విజయం సాధిస్తానంటూ అధిష్టానానికి విన్నవిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ వరిస్తుందో తెలియక పార్టీ నాయకులు, క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో వీరిలో ఎవరికో ఒక్కరికి ఖచ్చితంగా టికెట్ కేటాయించినా.. మరో ఇద్దరు వారితో సమన్వయంతో కలిసి పనిచేస్తారా..? అనే సందేహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని ముమ్మరం చేసి దూసుకుపోతుండటంతో.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయోమయంలో పడ్డారు.