Prakash Goud | బండ్లగూడ, జూన్ 9: రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధే తమ లక్షమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రూ.5.81 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు, సన్ సిటీ బాలాజీ పాపాలల్ స్వీట్ హౌస్ వద్ద నిర్మాణ పనులు,తిరుమల హిల్స్, శ్రీనివాస నగర్, ఇంద్రారెడ్డి కాలనీలో, విఘ్నేశ్వరా కాలనీ, కేకే నగర్ ఫేస్-2, వెంకటేశ్వర కాలనీ, శివసాయి నగర్, విష్ణుప్రియ కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, రోడ్డు వెడల్పు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వరకు కాలనీలలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామన్నారు.