అబిడ్స్, ఆగస్టు 28: గోషామహల్ నియోజకవర్గంలోని ఆగాపురా ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి నమూనాలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వివాదాస్పదమైంది. మానవులను దేవుళ్లతో పోల్చుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఆగాపురా ప్రాంతంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరహాలో వినాయక ప్రతిమను తయారు చేయించి ‘హైదరాబాద్ రైజింగ్’ పేరిట ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్టించారు.
ఈ సమాచారం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవుడితో సమానంగా పోల్చడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా దేవుడా? అని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం నమూనాలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడమంటే హిందూ దేవుళ్లను అవమానించడమేనని, తక్షణమే ఆ విగ్రహాన్ని తొలగించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్, వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆగాపురాలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి వెళ్లి తక్షణమే విగ్రహాన్ని మార్చాలని మెట్టు సాయికుమార్‌ను ఆదేశించారు. దీంతో బుధవారం రాత్రి మెట్టు సాయికుమార్ ఆ విగ్రహాన్ని తొలగించి మరో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.