సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీసు క్రైమ్స్ అండ్ సిట్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు మంగళవారం సైబర్‌క్రైమ్స్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును సమీక్షించారు. సైబర్‌క్రైమ్ లేబరేటరిని పరిశీలించిన అడిషనల్ సీపీ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వారి సిబ్బంది అంతా విధుల్లో ఉండి తమకు కేటాయించిన కేసుల దర్యాప్తుల్లో నిమగ్నమై ఉన్నట్లుగా గమనించిన శ్రీనివాసులు వారితో కొద్దిసేపు మాట్లాడి కేసుల దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీకి సంబంధించిన వివరాలను జీడీలో నమోదు చేసిన తర్వాత అక్కడే ఉన్న డీసీపీ అరవింద్‌బాబు, ఏసీపీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దర్యాప్తును వేగవంతం చేయాలని అడిషనల్ సీపీ సూచించారు.