దుండిగల్/ఖైరతాబాద్, ఆగష్టు 20 : రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.
దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిజాంపేట్‌లోని 26వ డివిజన్ మధురానగర్‌లోని ఉన్నతి అపార్ట్‌మెంట్‌పై మంగళవారం తెల్లవారు జామున పిడుగు పడింది. సుమారు 30 సెకన్ల పాటు భారీ శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత అపార్ట్మెంట్ వాసులు పరిశీలించగా విద్యుత్ కేబుళ్లు, లిఫ్ట్ మిషన్ దెబ్బతిన్నట్లు గుర్తించి, ఊపిరి పీల్చుకున్నారు. పలువురు ఫ్లాట్లలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు టీవీ, ప్రిజ్ వంటివి పాడైనట్లు తెలిపారు.
పక్కనే ఉన్న బాలాజీ అపార్ట్మెంట్లో కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యాయి. అదే విధంగా.. మంగళవారం తెల్లవారు జామున పంజాగుట్ట కాలనీలోని సుఖ్ నివాస్ అపార్టుమెంట్ ఆరవ అంతస్తుపై ఉన్న రెయిలింగ్, రేకుల షెడ్డుపై పిడుగు పడింది. దీంతో రేకులు ఎగిరి వచ్చి కారుపై పడటంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.