సిటీబ్యూరో, ఏప్రిల్ 6 ( నమస్తే తెలంగాణ ) / ముషీరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, అబిడ్స్, కోటి, కూకట్పల్లి, మూసాపేట్, అంబర్పేట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్, అంబర్పేట్, హిమాయత్‌నగర్‌లో వడగళ్ల వాన పడింది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరిత ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ముషీరాబాద్‌లో అత్యధికంగా 4.53 సెం.మీ.వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్‌లో 3.75 సెం.మీ, మారేడుపల్లి, ఆసిఫ్‌నగర్‌లో 3.23 సెం.మీ, నాంపల్లి, ఎల్బీస్టేడియంలో 3.1 సెం. మీ.ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం, ఉషోదయ కాలనీ పార్క్, సరూర్‌నగర్‌లోని నాగోల్ ప్రాంతాల్లో 0.2 సెం.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.