సిటీబ్యూరో: గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలైన ఎండల తీవ్రత సాయంత్రం 6 వరకు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు 41.4 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలు, గాలిలో తేమ 35 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, సోమవారం గ్రేటర్లోని పలు చోట్ల సాయంత్రం 5 గంటలకే ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.