చార్మినార్, జనవరి 3 : నమ్మకంగా నటిస్తూ చోరీకి పాల్పడిన ఓ మహిళతోపాటు ఆమె కుమారుడిని రెయిన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మీర్‌చౌక్ ఏపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. నాగబౌలి ప్రాంతంలో నివసించే సయ్యద్ మజారుద్దీన్ భార్య గత నెల 27న మృతి చెందగా.. కార్యక్రమాలు చేపట్టడానికి ఈ నెల 1న నల్గొండ జిల్లాకు వెళ్లారు. అయితే.. ఇంటి తాళం చెవిలను.. సమీపంలో ఉండే బంధువులకు ఇచ్చా డు. ప్రతి రోజు బాధితుడి ఇంట్లో భోజనాలు చేయడానికి అదే ప్రాంతానికి చెందిన షేక్ జరీనా వస్తున్నది.
ఈ క్రమంలో ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలతోపాటు నగదుపై దృష్టి పడింది. వెంటనే క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే కొడుకు షేక్ ఇర్షద్‌కు విషయం చెప్పింది. ఈ నెల 1న అర్ధరాత్రి ఇర్షద్… మజారుద్దీన్ ఇంట్లోకి ప్రవేశించి.. బీరువాలో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలతోపాటు నగదును తస్కరించాడు. 2న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యా ప్తు చేపట్టి.. షేక్ జరీనాను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించింది. వెంటనే ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆభరణాలతోపాటు లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్, అదనపు ఇన్స్పెక్టర్ మదన్‌లాల్, ఎస్సై మనోహర్ప్రభు, సిబ్బంది పాల్గొన్నారు.