ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్30: ఏడాది గడువులో మొత్తం 56 కేసుల్లో టన్నుకు పైగా గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మొత్తం కేసుల్లో 38 కేసుల్లో 53 మందిని అదుపులోకి తీసుకుని రూ.2.98 కోట్ల విలువైన 1194.363 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2024 సంవత్సరంలో రైల్వే పోలీసుల పరిధిలో జరిగిన నేరాల వివరాలను రైల్వే ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చందనాదీప్తి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంవత్సర కాలంలో మొత్తం 901 చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 142 కేసుల్లో 121 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం చోరీకి గురైన రూ.3.44 కోట్ల సొమ్ములో రూ.37.19 లక్షల సొమ్మును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. రికవరీ శాతం 10.80గా నమోదైందన్నారు. 2024 నవంబర్ వరకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా 870 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అవి పోగొట్టుకున్న వారికి అందజేసినట్లు వివరించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్లలో భాగంగా ఆరు కేసుల్లో 59 మంది అబ్బాయిలు, 25 మంది అమ్మాయిలను రక్షించి, వారిని శిశు సంరక్షణ కమిటీకి అప్పగించామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు జావేద్, కృపాకర్, శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్లు సాయి ఈశ్వర్‌గౌడ్, ఎల్లప్ప, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.