Hyderabad | కాచిగూడ, ఏప్రిల్ 8 : విధులు నిర్వహించడానికి రైలు పట్టాల పక్కన వెళ్తుండగా ఇనుప కడ్డీలు గుచ్చుకొని ఓ రైల్వే కూలీ మృతి చెందాడు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని లచ్చిపేట, మాల్కంగిరి ప్రాంతానికి చెందిన మోతిలాల్ బాస్ కుమారుడు సీబంత్ బాసు(60)వృత్తిరీత్యా రైల్వేలో కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం మలక్పేట్, డబీర్పురా రైల్వే స్టేషన్ల మధ్య విధులు నిర్వహించడానికి పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఇనుప కడ్డీలు, కంకర గుచ్చుకొని కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమ్మయ్య తెలిపారు.