Chicken | బొల్లారం2, ఫిబ్రవరి 13: రెండు మూడు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన చికెన్‌ను సమీపంలోని వైన్‌షాపులకు, బార్లకు విక్రయిస్తున్న దుకాణాల్లో జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. రసూల్‌పురలోని అన్నానగర్‌లో పూర్తిగా కుళ్ళి పాడైన స్థితిలో ఉన్న చికెన్ విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
స్థానిక ఎస్ఎస్ఎస్, రవి చికెన్ దుకాణాలలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నారు. రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంచిన కోళ్ల మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఆహారభద్రత, టాస్క్ అధికారులు పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు.