Yousufguda | బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ అధికారిపై రహ్మత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ దౌర్జన్యాల్ని నిరసిస్తూ యూసుఫ్‌గూడ సర్కిల్ అధికారులు, సిబ్బంది విధుల్ని బహిష్కరించారు. యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏ.బాలరాజ్‌ను రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించి దాడికి యత్నించారు. తన అనుచరులతో కలిసి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, దాదాగిరిని నిరసిస్తూ యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయం ఎదుట అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని.. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని.. ఆయనతో పాటు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.