సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ఒకరిని.. ప్రేమ పేరుతో వేధిస్తున్న మరో యువతిని వేధిస్తున్న వేరు వేరు ఘటనలలో నిందితులను రాచకొండ షీ టీమ్స్ అరెస్ట్ చేశాయి. గత 15 రోజుల్లో రాచకొండ షీ టీమ్స్ 214 మందిని పట్టుకోగా, వేధింపులకు గురువుతున్న పలువురు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు.
బస్టాండ్లు, రైల్వే, మెట్రో సేషన్లతోపాటు విద్యాలయాలు, కూరగాయల మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ డెకాయి అపరేషన్లు చేస్తూ, ఈవ్‌టీజింగ్ చేస్తున్న పోకిరీల ఆట కట్టిస్తున్నాయని ఆయన తెలిపారు. పట్టుబడ్డ పోకిరీలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళా సేఫ్టి డీసీపీ ఉషారాణి పర్యవేక్షణలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కాగా ప్రైవేట్ ఉద్యోగం చేసే యువతిని రెండేళ్ల నుంచి ప్రేమించాలని ఓ నిందితుడు వేధిస్తున్నాడు.
దాంతోపాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మేసేజ్‌లు పంపిస్తూ ప్రేమించకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి అనైన్లో పెడుతానని బెదిరింపులకు దిగుతుండడంతో బాధితురాలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ఒకే ప్రాంతంలో నివాసముండే బాధితురాలితో ఒక వ్యక్తికి పరిచయమైంది. ఆమెతో తరుచూ మాట్లాడుతూ ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఆ తరువాత ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు దిగి మానసికంగా వేధిస్తున్నాడు, అతనితో మాట్లాడడానికి ఆమె నిరాకరించడంతో అసభ్యకరంగా ఆమెను దూషిస్తుండడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.