హైదరాబాద్: పసిపిల్లల విక్రయాల కేసులో (Child Selling) అసలు సూత్రధారులెవరనే విషయాన్ని రాచకొండ పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు. ఢిల్లీ, పుణెలోని ప్రధాన ఏజెంట్ల ఆచూకీ తెలిస్తేనే.. హోంలో ఉన్న పిల్లల అసలు తల్లిదండ్రులను గుర్తించే అవకాశం ఉన్నది. చిన్న పిల్లలను విక్రయిస్తున్న ముఠా వ్యవహారాన్ని గత నెలలో ఒక స్వచ్ఛంద సంస్థ చొరవతో పోలీసులు గుర్తించి, 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారినుంచి 14 మంది పసి పిల్లలను కాపాడారు. ఇక్కడ పట్టుబడ్డ ముఠా మాదిరిగానే ముంబై, థానే పోలీసులు కూడా ఎనిమిది మంది సభ్యులున్న ఏజెంట్ల ముఠాను అరెస్టు చేసి, మూడు నెలల పసిపాపను కాపాడారు. అక్కడ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠా వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఈ రెండు ముఠాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. అయితే, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కీలకమైన ముఠా ఆచూకీ మాత్రం ఇప్పటికీ గుర్తించలేదు.
మేడిపల్లి పోలీసులకు పట్టుబడ్డ ముఠా 60 మంది పసిపిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. థానే పోలీసులు అరెస్టు చేసిన ముఠా మరెంత మందిని విక్రయించిందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. ముఠా నుంచి పోలీసులు కాపాడిన పసిపిల్లలు శిశు విహార్‌లో ఉన్నారు. అయితే, ముంబై, పుణెతో పాటు ఢిల్లీ మూలాలున్న కీలక నిందితులను పట్టుకుంటే.. ఎక్కడి నుంచి ఎంత మంది పిల్లలను తెచ్చారనే విషయంలో స్పష్టత రానున్నది. ఏజెంట్లను అరెస్టు చేసి 15 రోజులు అయ్యింది. మిగతా నెట్‌వర్క్‌ను గుర్తించడంలో దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉన్నది.
పోలీసులకు పట్టుబడ్డ ఏజెంట్లకు, పిల్లలను విక్రయించిన మరో ముగ్గురు ఏజెంట్ల ముఠా ఆచూకీ తెలిసినప్పుడే.. ఈ కేసు వేగంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్య పట్టుబడితేనే పిల్లల అసలు తల్లిదండ్రులెవరు.. ఎక్కడి నుంచి పిల్లలను ఎత్తుకొచ్చారు.. అనే విషయం తెలుస్తుంది. స్థానికంగా ఉన్న ఏజెంట్లు పోలీసులకు పట్టుబడటంతో ఢిల్లీ, పుణెలో ఉన్న ముగ్గురు ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికీ మేడిపల్లి పోలీసులు వీరి కోసం గాలించినా.. ఫలితం లేకుండా పోయింది. మహారాష్ట్ర పోలీసులు సైతం ఈ ముఠా కోసం వెతుకుతున్నారు. అయినా, కీలక నిందితులు తప్పించుకుంటున్నారు.
అసలు తల్లిదండ్రులను గుర్తించాలంటే..!
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠాకు సంబంధించిన మూలాల వరకు వెళ్లి.. వారి తల్లిదండ్రులను పోలీసులు గుర్తించాలి. అయితే, ఇక్కడ కొందరు తమ పిల్లలను స్వచ్ఛందంగానే డబ్బు కోసం ముఠాలకు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా పసి పిల్లల కిడ్నాప్, అదృశ్యానికి సంబంధించిన కేసులు నమోదు కాలేదు. స్వచ్ఛందంగా పిల్లలను విక్రయించిన వారు ఇప్పుడు తమ చిరునామాలను కూడా మార్చే అవకాశం ఉన్నది. మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన ఏజెంట్ల ముఠా విక్రయించిన మరో 46 మంది పసి పిల్లల ఆచూకీని గుర్తించాల్సి ఉన్నది. అదే విధంగా వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా గుర్తించాల్సి ఉన్నది. ఈ కేసును ఇప్పుడు రాచకొండ పోలీసులు చివర వరకు తీసుకెళ్తారా..? ఇక్కడే వదిలేస్తారా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ప్రస్తుతం అధికారుల బదిలీలు ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది.
దీంతో కింది స్థాయిలో ఉండే అధికారులు సైతం వేచి చూసే ధోరణితో ఉన్నారు. ఈ కేసు ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గుతుందనే వాదన సైతం వినిపిస్తోంది. శిశు విహార్‌లో ఉన్న 14 మంది పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వారి అసలు తల్లిదండ్రులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని వారు చెబుతున్నారు. ఇటీవల పసి పిల్లలను పోలీసులు రెస్క్యూ చేసి, వారిని శిశు విహార్‌కు తరలించిన విషయం తెలిసిందే. తమ పిల్లలను తీసుకెళ్లొద్దంటూ.. పెంచిన తల్లులు వేడుకున్నారు. ఆ తరువాత కొందరు హోం వద్దకు కూడా వచ్చి తమ పిల్లలను తమకివ్వాలంటూ ప్రాధేయపడ్డారు. నిబంధనల ప్రకారమే దత్తత తీసుకోవాలని, అందుకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ.. అధికారులు సూచిస్తూ.. వారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.